కరోనా పాండమిక్ నేపథ్యంలో చదువులు అటకెక్కాయ్. స్కూళ్ళు కొన్నాళ్ళు తెరచుకుని, మళ్ళీ మూసుకున్నాయ్. దాంతో, విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులే దిక్కు అవుతున్నాయి. పోనీ అవన్నా పద్ధతిగా సాగుతున్నాయా.? అంటే అదీ లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు, తమకు విద్యార్థుల నుంచి వచ్చే ‘సొమ్ములు’ ఆగిపోకూడదన్న కోణంలో మాత్రమే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. లేకపోతే, 8 గంటల పాటు ప్రత్యక్షంగా చదువు చెప్పి తీసుకునే ఫీజుల్ని, కేవలం మూడు నాలుగు గంటలు ఆన్‌లైన్ క్లాసులు చెప్పి గుంజేస్తున్నాయంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఏ స్థాయి దోపిడీలకు పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
కానీ, ప్రభుత్వాలు సదరు ప్రైవేటు విద్యా సంస్థలపై కన్నెర్రజేయలేకపోతున్నాయి. బహుశా ప్రభుత్వ పెద్దల్ని భయపెట్టగలిగే స్థాయికి ప్రైవేటు విద్యా మాఫియా ఎదిగిపోయిందేమో. అది వేరే సంగతి. ఆన్‌లైన్ చదువుల విషయంలో విద్యార్థులూ నానా రకాల తలనొప్పుల్ని భరిస్తున్నారు. కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం సహా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు విద్యార్థులు. కొందరైతే, ఆన్‌లైన్ చదువుల్ని పక్కన పెట్టి, చదువు పేరుతో ఇంటర్నెట్‌లో వల్గర్ కంటెంట్‌కి అతుక్కుపోతున్నారట. ఈ విషయమై పెద్దయెత్తున విమర్శలొస్తున్నాయి. అంతేనా, తమ పిల్లలు వల్గర్ కంటెంట్ పట్ల ఆకర్షితులవుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఆ అలవాటు మాన్పించేందుకోసం మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించాల్సి వస్తోందట. నాణానికి ఇది ఇంకో వైపు అన్నమాట. కేవలం ఆన్‌లైన్ విద్య కారణంగానే ఇలా జరుగుతోందా.? అంటే, పూర్తిగా అవును అనేయలేం. గతంతో పోల్చితే, విద్యార్థులు వల్గర్ కంటెంట్ పట్ల ఆకర్షితులవడం మాత్రం కరోనా సమయంలో బాగా పెరిగిపోయిందట.