Allu Arjun: బాధిత కుటుంబాన్ని కలుస్తా : అల్లుఅర్జున్‌

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను తాను కలవలేక పోతున్నానంటూ అల్లు అర్జున్‌ తాజాగా తెలిపారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘దురదృష్టకర సంఘటన తర్వాత వైద్య సంరక్షణలో ఉన్న శ్రీతేజ్‌ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణ కారణంగా.. ఈ సమయంలో శ్రీతేజ్‌ను, అతడి కుటుంబాన్ని కలవలేకపోతున్నాను. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతాను. వైద్యపరంగా, కుటుంబ పరంగా వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ను ఈనెల 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం శనివారం ఉదయం బెయిల్‌పై ఆయన్ని విడుదల చేశారు.