Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ లైనప్ లో మరో రెండు

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెనతో సంచలన విజయాన్ని నమోదు చేసి, 100 కోట్ల క్లబ్‌లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత వరుసగా చేసిన కొండ పొలం, రంగు రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వైష్ణవ్ తేజ్ కెరీర్ కాస్త సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళింది. అయితే, ఈ యువ హీరో విభిన్న కథలపై దృష్టి పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నాడు.

తాజాగా వైష్ణవ్ తేజ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ విరించి వర్మతో కలిసి పనిచేయబోతున్నాడు. ఉయ్యాల జంపాల వంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన విరించితో కలసి ఓ వినూత్న కథను తెరపైకి తీసుకురావడానికి వైష్ణవ్ సిద్ధమయ్యాడు. విరించి వర్మ గత ప్రాజెక్ట్ జితేందర్ రెడ్డి అంతగా సక్సెస్ కాకపోయినా, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కృష్ణ చైతన్యతో మొదలుకానుంది. ఇటీవల విశ్వక్ సేన్‌తో చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ద్వారా ప్రశంసలు అందుకున్న కృష్ణ చైతన్య, వైష్ణవ్ కోసం మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశాడట. వైష్ణవ్ తన నటనను మరింత కొత్త కోణాల్లో చూపించేందుకు ఈ రెండు సినిమాలు గొప్ప అవకాశాలు కల్పిస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మళ్లీ బూస్ట్ దక్కేలా ప్రత్యేకమైన కథల్ని సెట్ చేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులతో అతనికి ఎలాంటి విజయాలు వస్తాయో చూడాలి.