జపాన్ ప్రజలకు సారీ చెప్పిన డార్లింగ్.. త్వరలోనే కలుస్తానంటూ ప్రామిస్!

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యి రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న కల్కి సినిమా ఇప్పుడు జపాన్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. 2025 జనవరి 3న ఈ సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ప్ర‌మోష‌న్స్ కోసం చిత్ర‌యూనిట్ జ‌పాన్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇప్ప‌టికే జ‌పాన్ చేరుకొని వ‌రుస ప్ర‌మోషన్స్‌లో పాల్గోంటున్నాడు. అయితే మూవీ ప్ర‌మోష‌న్స్‌కి జ‌పాన్‌కి ప్ర‌భాస్ వెళ్ల‌లేక‌పోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ప్రభాస్ తను జపాన్ రాలేకపోతున్నందుకు అక్కడ ప్రజలకు సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ మొత్తం ఇంగ్లీషులో మాట్లాడి స్టార్టింగ్, ఎండింగ్ జపాన్ భాషలో మాట్లాడటం విశేషం. బాహుబలి సినిమాతో అక్కడ ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో తమ అభిమాన నటుడు తమ భాషలో మాట్లాడటంతో అతని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ వీడియోలో ఏం చెప్పాడంటే .. తాను జ‌పాన్‌కి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు ప్రభాస్‌.

ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా కాలికి గాయం కావ‌డంతో ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని అభిమానులకు చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు క‌ల్కి సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకోచ్చాడు. ప్ర‌భాస్ జపనీస్‌లో మాట్లాడడంతో ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమా జపనీస్‌ ప్రేక్షకులకి కూడా నచ్చుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఫ్యూచర్‌కి మహాభారతాన్ని లింక్‌ చేసి అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ను చూపించడం ద్వారా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశారు నాగ్ అశ్విన్. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కల్కి 2 ను రూపొందించే పనిలో ఉన్నారు. మన ఇండియాలో అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక హిందీ విషయానికి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.