Amaran: అమరన్‌ టీమ్‌ను రూ.కోటి నష్టపరిహారం చెల్లించమన్న విద్యార్థి.. అసలేం జరిగిందంటే!

Amaran: తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అమరన్‌. ఇటీవల విడుదల అయినా ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్‌ ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ విఘ్నేశన్‌ అనే ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు పంపించాడు.

గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా సాయి పల్లవి ఫ్యాన్స్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని దీని వల్ల ఇబ్బందిపడుతున్నానని, మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నాడు. అంతేకాకుండా అందుకుగాను తనకు నష్టపరిహారంగా రూ.1.1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు సదరు విద్యార్థి. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. అమరన్ మూవీలో ఒక సన్నివేశంలో సాయిపల్లవి హీరోకు తన ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది. దీని కోసం చిత్ర బృందం ఒక నంబర్‌ ఉపయోగించింది. సినిమా విడుదల అయ్యాక సాయిపల్లవి ఫోన్‌ నంబర్‌ అదే అని భావించిన అభిమానులు కాల్స్‌ చేయడం మొదలు పెట్టారు.

సినిమాలో చూపించిన నంబర్‌ తనేదనని, వరుస ఫోన్‌ కాల్స్‌, సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్‌ పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబ సభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పాడు. తన ఫోన్‌ నంబర్‌ ఉపయోగించినందుకు చిత్ర బృందం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.