ఒకప్పుడు చిన్నపిల్లలను స్కూల్‌కి పంపాలంటే కనీసం ఐదు సంవత్సరాలైనా రావాలి అనేవారు. ఐదేళ్ళ వరకు స్కూల్‌కి పంపేవారు కాదు. కానీ ప్రస్తుతం అలా కాదు. నాలుగేళ్ళు కూడా పూర్తిగా రాకుండానే పిల్లలను స్కూళ్ళకి తరిమేస్తున్నారు తల్లిదండ్రులు. సిటీల్లో ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ముందు ప్లే స్కూల్ అంటూ మూడేళ్ళకే పంపించేస్తారు. ఆ తర్వాత నర్సరీ, LKG, UKG అంటూ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఎందుకంటే పిల్లాడికి స్కూల్ అలవాటు కావాలనో లేదా ముందు నుంచే స్కూల్లో వేస్తే.. 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నేరుగా ఫస్ట్ క్లాసులో వేయొచ్చులే అని ఇలా ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను అతి తొందరగా పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దాంతో పిల్లలను పెద్దవాళ్ళు చూసుకునేవారు నాయనమ్మలు, తాతయ్యలు ఇలా అందరూ కానీ ప్రస్తుతం రోజులు అలా లేవు. దాంతో కొందరు స్కూల్లో ఉంటే సగం టెన్షన్ తగ్గుద్ది అని కూడా త్వరగా స్కూల్‌కి వేయడం జరుగుతుంది. వాస్తవానికి విద్యా హక్కు (RTE) చట్టం 2009 ప్రకారం.. ఒక పిల్లాడు 6 ఏళ్ల వయస్సు కంటే ముందుగానే 1వ తరగతిలోకి ప్రవేశించాలని ఆదేశించింది. కానీ, భారతీయ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను 4 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేర్పిస్తున్నారు. అయితే దీని గురించి కొంత మంది తల్లిదండ్రులను అడగగా..నెమ్మదిగా అతడే అలవాటు అవుతాడులే అని పంపిస్తున్నామని అంటున్నారు. ఈ పద్ధతి.. ప్రస్తుతం నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా నడుస్తోంది.
వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (ASER) 2019 ప్రకారం.. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది 1వ తరగతి చదువుతున్నారు. అతి తక్కువ వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేరడం ద్వారా వారి కంటే పెద్ద పిల్లలే కాస్త యాక్టివ్‌గా ఉంటూ మెరుగ్గా చదువుల్లో రాణిస్తున్నారని నివేదిక సూచిస్తోంది. అంటే.. అక్షరాలతో పాటు సంఖ్యలను గుర్తించగలగడం.. అలాగే చదవగల సామర్థ్యం ఎక్కువగా పెద్ద పిల్లల్లోనే ఉంటుందని తెలిపింది. ‘పిల్లలను చాలా చిన్న వయస్సులోనే అధికారిక పాఠశాలల్లో చేర్పించడం కారణంగా వారి స్కూల్ లైఫ్.. విద్యాపరంగా ఇతరుల వెనుక ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం’ అని నివేదిక పేర్కొంది.
ఒక పిల్లవాడు కిండర్ గార్టెన్‌లో చేరేముందు UK లేదా USలో వరుసగా 5 లేదా 6 సంవత్సరాల వయస్సు తప్పనిసరిగా ఉండి తీరాలి. పిల్లల పాఠశాల ప్రారంభ వయస్సు ఒక వ్యక్తి దీర్ఘకాలిక ఆదాయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని వెల్లడించింది. ఇలా అతి చిన్న వయసులో స్కూళ్ళకి వెళ్ళడం ద్వారా వారి మానసిక స్థితి పై కూడా చాలా ఒత్తిడి ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.