Ambanti: వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు తరచూ సోషల్ మీడియా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఈయన ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూటమి నేతలను ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే నేడు వైకాపా పార్టీ నేతలు అందరూ కూడా కలెక్టరేట్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాలలో కూడా పెరిగిన విద్యుత్ చార్జీలపై కలెక్టరేట్ ను ముట్టడించాలంటూ జగన్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే అధినేత ఆదేశాలు మేరకు గుంటూరులో కరెంటు చార్జీల బాదుడిపై వైసీపీ పోరుబాట కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… విద్యుత్ చార్జీలతోపాటు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక, పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. వరి రైతుకు కనీసం 1740 గిట్టుబాటు ధరను ప్రభుత్వం చెల్లించాలని ఈయన డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఒక బస్తా కూడా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయలేదని తెలిపారు.
1300కు, 1400కు బేరాలు ఆడి మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు..అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఫైర్ అయ్యారు. పెంచిన విద్యుత్తు చార్జీలను వెంటనే తగ్గించాలని ఈయన డిమాండ్ చేశారు. ఇకపోతే తమ పార్టీకి గతంలో వచ్చిన సీట్ల గురించి కూడా ఈయన ప్రస్తావించారు. తమ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉన్నాయని ఎవరు సంబర పడద్దని తెలిపారు. తమ పార్టీకి 40% ఓట్ షేరు ఉందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అంటూ అంబటి రాంబాబు కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగిన తప్పకుండా వైకాపా వారికి అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అధికారులు మెలగాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం తల వంచే విధంగా పోరాడుతామన్నారు. జరుగుతున్న ఉద్యమాన్ని ,పోరుబాటగా తీసుకువెళ్తాం …ప్రజలందరూ కలిసి రావాలని తెలిపారు.