KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి అనూహ్య నిర్ణయాలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ నేతలకు ఏ విధమైనటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని ఉన్నఫలంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. గతంలో పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇదే తరహాలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా పార్టీ సీనియర్‌నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో అరెస్టు చేశారని మండిపడ్డారు.
కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టు చేయటాన్ని ఈయన ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలు అట్టకేక్కాయి 7వ గ్యారెంటీ అయినటువంటి ఎమర్జెన్సీ అమలు అవుతుందని విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదని, అరెస్టులు అంతకన్నా కాదని, ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో బెదిరింపు చర్యలకు భయపడేది లేదని ఈయన ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును పూర్తిస్థాయిలో తప్పుపట్టారు.
