ఇంటి ముందే కొరడాతో కొట్టుకున్న అన్నామలై

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన వినూత్న నిరసనతో డీఎంకే ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించారు. శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా కొట్టుకున్న ఆయన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు ప్రతిస్పందనగా చేపట్టిన నిరసనగా పేర్కొన్నారు.

గురువారం మీడియా సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు డీఎంకేకి చెందిన వ్యక్తి అని, ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు. డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు కూడా వేసుకోనని, అలాగే 48 రోజుల నిరాహార దీక్ష చేయబోతున్నట్లు తెలిపారు.

తన నిరసనలో భాగంగా శుక్రవారం ఉదయం తన నివాసం వద్ద కొరడా దెబ్బలు తీసుకుంటూ డీఎంకే ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బీజేపీ శ్రేణులు ఆయనకు మద్దతు తెలుపగా, డీఎంకే శ్రేణులు ఈ చర్యను విమర్శించాయి. అయితే, ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అన్నామలై దీక్ష, నిరసనలు తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ పెంచుతున్నాయి. డీఎంకే ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.