Kids: సాధారణంగా మనం చిన్న పిల్లలు తరచు నోట్లో వేలు వేసుకోవడం చూస్తూ ఉంటాం. కొందరికి ఇది అలవాటుగా ఉంటుంది. పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోరు చాలామంది పిల్లలు నాలుగైదు సంవత్సరాలు వచ్చేలోపు పూర్తిగా ఈ అలవాటును మానుకుంటారు. ఈ విధంగా చిన్న పిల్లలకు కనక నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటు మానిపించడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా నోట్లో వేలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయానికి వస్తే.. చిన్నపిల్లలు ఇలా తరచూ నోట్లో వేలు వేసుకోవడం వల్ల వారికి దంతాల సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దంతాలు సక్రమంగా రాకుండా ఉండటమే కాకుండా పెదాలు పెద్దవిగా రావడంతో వారి అందం చెడిపోతుంది.
ఇక తరచూ నోట్లో వేలు పెట్టుకోవడం, తీయడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కి తొందరగా గురయ్యే అవకాశాలు ఉంటాయి.ఈ అలవాటు వల్ల నోటిలోకి బ్యాక్టీరియా చేరి వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోకుండా వారి అలవాటు మాన్పించాలి అయితే ఇలాంటి అలవాటు రావడానికి కూడా ప్రధాన కారణం లేకపోలేదని చెప్పాలి.
పిల్లలు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు.. కానీ, తల్లిదండ్రులు దీనిని చాలా సాధారణ విషయంగా భావిస్తారు. పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకోవడం వల్ల వారికి ఆకలి అనే భావన కలగదు.దాంతో పిల్లలు పాలు కానీ, భోజనం కాని అడగరు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటున్నారు.తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంతవరకు ఈ అలవాటును మాన్పించడం ఎంతో మంచిది.