పాత కథే.! ఇందులో కొత్గగా మాట్లాడుకోవడానికేముంది.? కాకపోతే, ఈసారి వైఎస్ షర్మిల పేరుతో కొత్త కథ తెరపైకొచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీకి సంబంధించి సీబీఐ, వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని తాజా చార్జి షీటులో పేర్కొందిట.
వైఎస్ షర్మిలను సాక్షిగా పేర్కొంటూ, ఆమె వాంగ్మూలాన్ని న్యాయస్థానం ముందుంచిందట. గత అక్టోబరులోనే, వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసిందట. సర్వోన్నత న్యాయస్థానంలో తాజాగా సీబీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రచారంలో వున్న కథనాల సారాంశమేంటంటే, కడప ఎంపీ సీటు వ్యవహారమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణమట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా ఓటమికీ, ఆయన హత్యకీ సంబంధం వుందట. కడప ఎంపీ సీటుకి వైఎస్ వివేకా పోటీ చేయాలనుకున్నారట. వైఎస్ షర్మిల పోటీ చేసినా ఫర్లేదన్నారట వైఎస్ వివేకా.
‘మా కుటుంబంలో అందరం కలసి మెలిసే వుంటాం. పైకి కనిపించేది ఇదే. లోలోపల మా కుటుంబంలో కూడా అభిప్రాయ బేధాలు, మనస్పర్ధలూ వున్నాయి. వైఎస్ వివేకాకీ అవినాష్ రెడ్డికీ, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికీ మధ్య గొడవలున్నాయ్..’ అని వైఎస్ షర్మిల వాంగ్మూలమిచ్చారట.
ఏంటీ, ఇదంతా నిజమేనా.? నిజమేనంటోంది టీడీపీ అనుకూల మీడియా. సర్వోన్నత న్యాయస్థానంలోనే సీబీఐ ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించిందట. సో, నమ్మాల్సిందేనేమో.! ‘కడప ఎంపీ సీటు.. వైఎస్ వివేకా మరణానికి కారణం.. ఆస్తి గొడవలు, కుటుంబ గొడవలు కాదు.. అంతకు మించిన రాజకీయ గొడవలు వైఎస్ వివేకా మరణానికి కారణం.. ఇది వాస్తవం..’ అని గతంలోనే వైఎస్ షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే.