Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్యాన్ హెచ్చరిక.. ఈసారి సూసైడ్ లెటర్

Game Changer: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి పండుగకు విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో ట్రైలర్ కోసం భారీగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ట్రైలర్ ఆలస్యం కావడం అభిమానుల్లో అసంతృప్తి రేపుతోంది. దానితో కొందరు తమ ఆందోళనలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఫ్యాన్ మేకర్స్‌ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. డిసెంబర్ చివరికి ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ రోజు విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ఈ లేఖ వైరల్ కావడంతో అభిమానుల వివాదం మరోసారి చర్చకు దారితీసింది.

ఇలాంటి పరిస్థితులు సినిమా ప్రమోషన్స్‌లో ఎదురుకావడం దురదృష్టకరం. అభిమానులు హీరోలపై ఉండే ప్రేమ అర్థమవుతుంది కానీ, అది హద్దులు దాటితే సమస్యగా మారుతుంది. సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు ఈ ఫ్యాన్ చర్యలను తప్పుబడుతూ, ఇలాంటి పద్ధతులు ఎప్పటికీ సరైనవికావని వివరిస్తున్నారు. అభిమానంగా ఉంటూ తగిన ఆదరణను చూపించడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రేమను ఇలా అసహనంగా ప్రదర్శించడం వల్ల ఇతర అభిమానుల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, గేమ్ ఛేంజర్ మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీపై చర్చించారని, థియేట్రికల్ రిలీజ్‌కు ఐదు రోజుల ముందు ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అభిమానులు తొందరపడకుండా, మేకర్స్‌పై నమ్మకంతో ఉండాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.