దుబాయిలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రాజమల్లయ్యకు అదృష్టం వరించింది. అబుదాబీలో నిర్వహించిన బిగ్ టికెట్ మిలియనీర్ లాటరీలో ఆయన ఏకంగా 1 మిలియన్ దిర్హామ్‌లు (రూ. 2.32 కోట్లు) గెలుచుకున్నారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల రాజమల్లయ్య గత 30 ఏళ్లుగా విదేశాలలో ఉంటూ తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతున్నారు.
ఈ లాటరీతో ఆయన జీవితంలో తొలి విజయాన్ని సాధించడమే కాకుండా, తన కుటుంబానికి భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేశారు. రాజమల్లయ్య గతంలోనూ లాటరీ టికెట్లు కొన్నప్పటికీ, మధ్యలో మానేశారు. కానీ రెండు నెలల క్రితం తన స్నేహితులతో కలిసి మళ్లీ టికెట్లు కొనడం ప్రారంభించారు. అదృష్టం మెరిసి ఈ బంపర్ లాటరీ గెలుచుకున్నారు. “లాటరీ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిసినప్పుడు నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి,” అని రాజమల్లయ్య ఉద్వేగంతో చెప్పారు.
ఈ నగదు బహుమతిని రాజమల్లయ్య తన స్నేహితులతో పంచుకోవాలని నిర్ణయించారు. తన వాటాగా వచ్చిన సొమ్మును కుటుంబ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని చెప్పారు. “ఇది నా జీవితంలో మొదటి గొప్ప విజయం. నాకు ఈ అవకాశం రావడం వల్ల నా కుటుంబానికి మరింత భరోసా కల్పించగలుగుతున్నాను. ఇప్పటికీ లాటరీ టికెట్లు కొనడం కొనసాగిస్తాను,” అని ఆయన తెలిపారు. రాజమల్లయ్య జీవితం ఇలా మారడంతో, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగిపోయారు.