Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఘటన కలకలం రేపింది. వై కేటగిరీ భద్రత కలిగిన పవన్ చుట్టూ బలివాడ సూర్యప్రకాశ్ రావు అనే వ్యక్తి ఐపీఎస్ యూనిఫాంలో తిరిగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నెల 20న పార్వతీపురం ప్రాంతంలో జరిగిన పవన్ పర్యటనలో సూర్యప్రకాశ్ తన ప్రవర్తనతో అధికారులు, ప్రజలను భ్రమపరిచాడు.

పవన్ పర్యటనలో సూర్యప్రకాశ్ ఐపీఎస్ యూనిఫాంలో ఉండటంతో, కొందరు పోలీసు అధికారులు అతనికి సెల్యూట్ చేశారు. ఇక ఉన్నత అధికారులు అది గమనించి ఈ వ్యవహారంపై అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై హోం మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. “డిప్యూటీ సీఎం పర్యటనలో ఇలాంటి భద్రతా లోపాలు చాలా తీవ్రమైనవిగా పరిగణించాలి. దీనికి సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని ఆమె హెచ్చరించారు. నకిలీ ఐపీఎస్ వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన పోలీసు అధికారులను కూడా విచారణకు పిలిపించనున్నారు.

మరోవైపు, నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాశ్‌ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను ప్రభుత్వ అధికారుల దృష్టి మళ్లించి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కల్యాణ్ వంటి ప్రముఖుడి పర్యటనలో ఇటువంటి ఘటన జరగడం రాష్ట్ర భద్రతా వ్యవస్థపై అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనిపై అధికారుల సమగ్ర నివేదిక తర్వాత తగిన చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.