Aamir Khan: అమీర్ ఖాన్ తో టాలీవుడ్ డైరెక్టర్.. ఫిక్స్ అయినట్లేనా?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ దర్శకుడితో పని చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆఖరి చిత్రం లాల్ సింగ్ చద్దా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అమీర్ ఖాన్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తనను తాను రీబిల్డ్ చేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన కథ అమీర్‌ను ఆకట్టుకుందని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని తెలుస్తోంది. వంశీ చెప్పిన స్క్రిప్ట్ అమీర్ ఖాన్ పాత్రకు పూర్తిగా సరిపోతుందని, ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌కు సరైన మలుపుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు వంశీ తీసిన సినిమాల్లో అత్యధిక చిత్రాలు దిల్ రాజు నిర్మించగా, ఈ ప్రాజెక్టు కూడా అదే బాటలో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

వంశీ పైడిపల్లి మహర్షి, వారసుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ఇటీవల టాలీవుడ్ లో సరైన అవకాశం అందుకోలేకపోయిన వంశీ, బాలీవుడ్ స్టార్‌లతో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా షాహిద్ కపూర్‌తో ప్రాజెక్టు చర్చల్లో ఉందని వార్తలు వినిపించినా, ఇప్పుడు అది అమీర్ ఖాన్ చేతికి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు క్రేజీ కాంబినేషన్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.