మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్, ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ 171 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఆట తొలి సెషన్‌లోనే భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిన సమయంలో నితీశ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రారంభంలో నిలకడగా ఆడిన అతడు, ఆసీస్ బౌలర్ల దాటికి తలొగ్గకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల కీలక భాగస్వామ్యం సాధించాడు. ఈ భాగస్వామ్యం భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించింది. వాషింగ్టన్ సుందర్ అర్ధశతకంతో సహకరించగా, నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అభిమానులను గర్వపడేలా చేసింది.
సెంచరీ సమీపంలోకి వచ్చిన నితీశ్ ఒత్తిడి ఎదుర్కొన్నారు. 99 పరుగుల వద్ద నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నప్పుడు, చివరి బ్యాటర్ సిరాజ్ నిలకడగా ఆడుతూ నితీశ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. చివరగా, బౌలర్ బోలాండ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు. స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఈ విజయం చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా నితీశ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై మైఖేల్ వాన్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. జట్టు కీలక ఆటగాళ్లు విఫలమైన సమయంలో నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టుకు అద్భుతమైన స్థిరత్వాన్ని అందించింది.