విజయవాడ స్వర్ణ ప్యాలెస్ నందు అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన ఘటన పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హోటల్ నందు క్వారంటైన్ సెంటర్ నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యం పై ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. విచారణ ఆద్యంతం తప్పు మొత్తం రమేష్ హాస్పిటల్ యాజమాన్యానిదే అంటూ సాగింది. ఈలోపు హాస్పిటల్ ఎండీ రమేష్ అజ్ఙాతంలోకి వెళ్ళిపోవడంతో ఆయన మీద అభియోగాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు కలుగజేసుకోవడంతో పెద్ద రచ్చే జరిగింది. ఒకానొక దశలో కుల రాజకీయాలకు తెర లేచింది. టీడీపీ శ్రేణులు రమేష్ హాస్పిటల్ తరపున వకాల్తా పుచ్చుకోవడంతో ప్రభుత్వం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తోందని కొత్త గొడవ మొదలైంది.
డాక్టర్ రమేష్ బంధువు హీరో రామ్ మధ్యలో తలదూర్చడంతో ఆయన మీద కూడా ఎదురుదాడి జరిగింది. నేరుగా పోలీసులే కేసు విచారణ జరిగేటప్పుడు కలుగజేసుకోవద్దని ఆయన్ను హెచ్చరించారు. డాక్టర్ రమేష తనను అరెస్ట్ చేయడం తగదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులకే ఎదురు ప్రశ్నలు సంధించి రమేష్ మీద తదుపరి చర్యలు తీసుకోవద్దని, ఎఫ్ఐఆర్ మీద స్టే ఇచ్చింది. స్టే ఇచ్చే సమయంలో ఏళ్ల తరబడి హోటల్ నందు కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించి, హోటల్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహణకు అనుమతులిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారి కూడా ప్రమాదానికి బాధ్యులే కదా, వారిని కూడ నిందితులుగా చేరుస్తారా అంటూ ప్రశ్నించింది.
హైకోర్టు ప్రశ్నలో అర్థం ఉంది.. కానీ :
హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సరైనవే. ప్రమాదానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ విచారించాలి. కోర్టు చెప్పినట్టు కేవలం డాక్టర్ రమేష్, ఇతర హాస్పిటల్ యాజమాన్యం మీదే మొత్తం తప్పిదాన్ని మోపడం సరైన తరహా విచారణ కూడ కాదు. ఆయనతో పాటు మిగిలిన వారి మీద కూడ విచారణ జరపాల్సిందే. అనుమతులిచ్చిన అధికారుల్నీ బాధ్యుల్ని చేయాల్సిందే. కానీ వారి మీద చర్యలు తీసుకోకుండా డాక్టర్ రమేష్ మీద కూడా తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా స్టే ఇవ్వడమనేదే సమంసజం అనిపించడం లేదు. ఈ లెక్కన ఒక కేసులో మొత్తం 10 మంది మీద అభియోగాలు ఉన్నప్పుడు వారిలో 8 మంది మాత్రమే దొరికి, ఇంకో ఇద్దరు దొరక్కపోతే చిక్కిన 8 మంది మీద విచారణ లాంటి చర్యలు చేపట్టవద్దని అనలేం కదా. ముందు దొరికిన వారిని విచారించి మిగిలిన వారి మీద కూడ విచారణ తప్పక చేయాలని అంటే బాగుంటుంది.
ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మూలాన పోలీసుల చేతులు కట్టేసినట్టైంది. అసలు కరోనా ట్రీట్మెంట్ పేరిట వేలు, లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వసతులు, భవంతుల నాణ్యత, సామర్థ్యం లాంటి వాటి మీద కూడ దృష్టి పెట్టాలి. భవనం తమది కాదని, లీజుకు మాత్రమే తీసుకున్నాం అంటే సరిపోదు. కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి వైద్యం కోసం వచ్చిన వారి కోసం జాగ్రత్తలు పాటించాలి. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అదే లోపించింది. సరైన తనీఖీలు, ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమైంది. ఇందులో హాస్పిటల్ యాజమాన్యం తప్పు ముమ్మాటికీ ఉంది. హైకోర్టు సైతం ప్రమాణాలు పాటించకపోవడం హాస్పిటల్ నిర్లక్ష్యానికి నిదర్శనం అంది కానీ రమేష్ మీద తదుపరి విచారణ చేయకుండా స్టే ఇచ్చింది.
జగన్ సర్కార్ సుప్రీంకు వెళ్లాల్సింది ఇప్పుడే :
కాబట్టి.. ఈ స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చు. హైకోర్టు తీర్పులను, స్టేలను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం ఏపీ ప్రభుత్వానికి కొత్త కాద. రంగుల జీవో, ఇంగ్లీష్ మాధ్యమం, పేదల ఇళ్ల పట్టాల పంపిణీ, మూడు రాజధానుల అమలు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లాంటి విషయాల్లోనే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసులన్నింటిలోనూ హైకోర్ట్ తీర్పు ఖచ్చితంగా ఉన్నా, హైకోర్టు లో గెలవలేమని తెలిసినా పంతం కొద్ది పిటిషన్లు వేసి, ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడ్డారు పాలకులు. అలాంటిది డాక్టర్ రమేష్ పై విచారణకు స్టేను సవాల్ చేయడంలో కొద్దిగా హోప్ కనిపిస్తోంది. సుప్రీం జోక్యంతో కింది కోర్టు తీర్పు మారవచ్చేమో. ఏవేవో బలహీనమైన విషయాల్లోనే సుప్రీం గడప తొక్కిన వారు ఈ అంశం కోసం మరోసారి పైకోర్టుకు వెళ్ళి తీరాల్సిందే. అదే విధంగా హైకోర్టు ప్రశ్నించినట్టు అనుమతులిచ్చిన ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నకు కూడ సరైన వివరణ ఇచ్చి హైకోర్టును సంతృప్తిపరచాలి.