Foreign Students: అందులో పాల్గొన్నావా? అమెరికాలో ఉండలేవు! విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఇమిగ్రేషన్

అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. విద్యార్థుల భద్రత, భావప్రకటన స్వేచ్ఛలపై ప్రశ్నలు తలెత్తేలా అమెరికా విదేశాంగ శాఖ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ పేరుతో కొంతమంది విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ పంపించి… వారి వీసాలను రద్దు చేసినట్లు సమాచారం అందింది.

ఈ విద్యార్థులపై అభియోగం ఏంటంటే… యూనివర్సిటీలలో జరిగిన కొన్ని ఆందోళనలలో పాల్గొనడం లేదా వాటికి సంబంధించిన ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో పంచుకోవడం. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఇలాంటి ప్రచారంలో పాల్గొన్నవారికి వీసా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఈమెయిల్స్‌లో స్పష్టంగా చెప్పిన విషయం ఏమంటే – “మీ వీసా రద్దయింది. SEVP అధికారులకు సమాచారం పంపాము. ఇకపై స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లండి. లేదంటే అరెస్ట్ చేస్తాం. అలాగే భవిష్యత్తులో అమెరికా వీసా మంజూరు కూడా కలుగదు.” దీనితో విద్యార్థుల్లో గందరగోళం మొదలైంది. కొందరు ఇప్పటికే తమ పోస్టులను డిలీట్ చేయడం మొదలుపెట్టారు.

ఈ చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమే ఎలాంటి జాతివ్యతిరేక కార్యకలాపంగా మారుతుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు నిపుణుల నుంచి వస్తున్నాయి.