AP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యే నేటికీ సరిగా 43 సంవత్సరాలు కావడంతో నేడు మంగళగిరిలో 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు నేతలు పాల్గొన్నారు. ఇక ఈ జెండా ఆవిష్కరణ అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మహనీయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. అయితే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు అలాంటి ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని.. క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాళ్లకు ఆటోమెటిక్‌గా పదువులు వస్తాయని తెలిపారు.
ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ గురించి గతంలో హేళన చేసిన వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా ఆడపడుచులకు, అన్నదాతలకు, సామాన్యులకు అండగా నిలిచిన జెండా అని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని పార్టీకి మేము వారసులమే కానీ పెత్తందారులు కాదని చంద్రబాబు నాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటుంటారని అన్నారు.
మన పార్టీ ద్వారా మరో చరిత్రకు శ్రీకారం చుట్టుబోతున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి-బంగారం కుటుంబం పథకాలను తీసుకొస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించి ఆ సంపద పేదలకు చేర్చాలనే తన సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు.