రావి చెట్టును హిందూ మతం లో పవిత్రమైనదిగా భావిస్తారు, దీనిని ‘అశ్వథ’ లేదా ‘పీపల్’ అని కూడా అంటారు. ఈ చెట్టును పూజించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావి చెట్టు ఆకులు, బెరడు, పండ్లు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి.
రావి చెట్టు ఆకులను, బెరడును పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి రావి చెట్టు ఆకులు దోహదపడతాయి. మలబద్ధకాన్ని తగ్గించటానికి రావి పండ్లు ఉపయోగపడతాయి. జలుబు, ఉబ్బసం వంటి వ్యాధులను నయం చేసే శక్తి రావి బెరడుకు ఉంది. విపరీతమైన అలసట, ఫిట్‌నెస్ లోపించడం, శరీర కండరాలను బలోపేతం చేయడం వంటి ప్రభావాలను దూరం చేస్తుంది.
రావి చెట్టును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని బ్రహ్మపురాణం చెబుతుంది. హిందూ ఆచారాల ప్రకారం అధ్యాత్మికతను పెంచి ప్రశాంతతను కలిగించే అద్భుతమైనదిగా ఈ చెట్టును భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో రావిచెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. రోజూ రావిచెట్టు నీడన నిలబడితే శనిదోషం తొలగిపోతుంది. కొద్ది రోజులు నమస్కారం చేసి, చెట్టును హత్తుకుంటే శనిదోషం పరిహారమవుతుంది. రావిచెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలను చేస్తారు.
రావి చెట్టును పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హిందువుల నమ్మకాల ప్రకారం, రావిచెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ వృక్షాన్ని దైవంగా ఆరాధిస్తారు. ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావి చెట్టు ఒకటి. ఇది దేవతావృక్షంగా పేరు పొందింది. అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలలో కూడా రావిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది