వల్లభనేని వంశీకి ఎదురవుతున్న కేసులు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు భూకబ్జా కేసుకు దారితీసింది. దీంతో వంశీ ప్రస్తుతం మూడవ కేసులోనూ విచారణకు ఎదురవుతున్నారు. విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్ రాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అయితే ఇది వైసీపీకి మొదటే కావొచ్చు కానీ చివర కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రస్తుతం సమాచారం ప్రకారం, వంశీ తర్వాత కేసుల పర్వం మరింత వేగంగా కొనసాగనుందని అంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ ఇప్పటికే కొన్ని కేసులు ఎదుర్కొంటుండగా… ఇకపైన మరిన్ని నేతలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నారట. నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనపై అరాచకాలకు సంబంధించిన వివరాలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు.
అలాగే, మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మరో కీలక కేసు కూడా రాబోతుందని సమాచారం. గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు గిరిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలతో పాటు పలు ఆరోపణల నేపథ్యంలో అధికారులు కేసులు నమోదు చేయడానికి సిద్దమవుతున్నారు. అధికారిక సమాచారం రాగానే చర్యలు ప్రారంభించనున్నారు.
ఇక నరసారావుపేట మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఔషధ దుకాణాలపై ఇటీవల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాడుల నివేదికలు పూర్తి కావడంతో, ఆయన్ను కూడా చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి వంశీ కేసుతో మొదలైన ఈ బాక్స్ ఓపెన్.. ఇక వైసీపీకి చెందిన మరికొంత మంది నేతలను ఇరికించే దిశగా సాగుతుందని రాజకీయం చెబుతోంది. అధికార మార్పు తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు మరిన్ని పరిణామాలకు నాంది పలకబోతున్నాయన్నది స్పష్టం.