గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో రోజు కోర్టు నుండి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు త్రోసిపుచ్చింది. ఇది వరుసగా రెండో రోజు బెయిల్ నిరాకరణ కావడంతో వంశీకి చుక్కలు కనిపిస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గురువారం కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు, ఇప్పుడు రెండో కేసులోనూ ఇదే తీర్పు రావడం గమనార్హం.
వంశీ గతంలో టీడీపీ తరఫున గన్నవరం నుంచి విజయం సాధించిన తర్వాత, రాజకీయ క్షేత్రంలో పెద్ద మార్పు చేశారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన వంశీ… జగన్ మద్దతుతో బలంగా ఎదగాలని భావించారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఆయనను ఇబ్బందుల్లో నెట్టాయి. అదే వ్యవహారం ఇప్పుడు కోర్టుల మెట్లపై ఆయనకు తలనొప్పిగా మారింది.
కిడ్నాప్ కేసులో వంశీకి రిమాండ్ విధించిన పోలీసులు వారం రోజుల పాటు విచారణ జరిపారు. ఈ కేసులో ఆయన పూర్తి సహకారం అందించారని, ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని వంశీ తరఫు న్యాయవాదులు కోరగా… సత్యవర్థన్ తరఫు న్యాయవాదులు మాత్రం భిన్నంగా వాదించారు. వంశీ బెయిల్‌పై బయటకు వచ్చినట్లయితే సత్యవర్థన్‌కు ప్రాణహాని తప్పదని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చివరికి వంశీ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇక గన్నవరం దాడి కేసు, కిడ్నాప్ కేసు… రెండింటిలోనూ బెయిల్ నిరాకరణతో వంశీపై ఆర్థికంగా, రాజకీయంగా ఒత్తిడి పెరిగింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వంశీకి ఇప్పుడు జగన్ వర్గం నుండి అంత మద్దతు లేదన్న వార్తలతో, బెయిల్ ఆశలు చల్లబడడంతో ఆయన భవిష్యత్ దిశపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.