ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి మామూలుగా లేదు. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్, మోహన్ లాల్ , పృథ్వీరాజ్ కాంబోలో వచ్చిన ఎంపురాన్, విక్రమ్ నటించిన వీర ధీర శూర, కామెడీ ట్రాక్‌పై వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రంగంలోకి దిగాయి. ఎగ్జామ్స్ సీజన్ నడుమ వచ్చినప్పటికీ సినిమాల సంఖ్య పెరగడంతో ఆడియన్స్ కు ఎంపికల సంగతి క్లిష్టమైంది. కానీ కంటెంట్ పరంగా మాత్రం ఒకటి రెండు మాత్రమే పర్‌ఫెక్ట్ చాయిస్‌లుగా నిలుస్తున్నాయి.
విక్రమ్ నటించిన వీర ధీర శూర సినిమాకు క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, కథాంశం, సినిమా నిర్మాణ విలువలు, దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తీసిన నెరవేర్పు మాత్రం బలంగా నిలుస్తున్నాయి. తంగలాన్ తర్వాత వచ్చిన విక్రమ్ సినిమా కావడంతో అంచనాలు ఉండగా, టైటిల్‌కు తగ్గట్టే ధైర్యమైన కథనంతో ముందుకెళ్లింది. అయినా కథలో తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ కొంత వెనకడుగు వేసే అవకాశం కనిపిస్తుంది.
ఇక నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన రాబిన్ హుడ్, కళ్యాణ్ శంకర్ రూపొందించిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలు తమదైన కామెడీ టచ్‌తో నవ్వులు పూయించాయి. ఈ రెండు సినిమాల కథలు కొత్తగా లేనప్పటికీ, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మాత్రం జనం మెచ్చేలా ఉన్నాయి. యూత్ ఆడియన్స్ కు ఇవి మంచి టైమ్‌పాస్ ఆప్షన్ అయ్యాయి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే స్పీడ్ ఎక్కువగా ఉండటం, హాస్యాన్ని సమర్ధవంతంగా నెరవేర్చడం ప్లస్ పాయింట్లు.
అంతటి హైప్‌తో వచ్చిన మోహన్ లాల్ ఎంపురాన్ మాత్రం ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. టెక్నికల్‌గా బాగున్నా, కథ బలహీనత వల్ల థియేటర్లలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఓవర్సీస్ లో మాస్ రెస్పాన్స్ ఉన్నా, కంటెంట్ పరంగా వెనకబడి పోయిందని చెప్పాలి. మొత్తానికి ఈ వారం విడుదలైన చిత్రాల్లో కంటెంట్ పరంగా విక్రమ్ ‘వీర ధీర శూర’ మొదటి స్థానంలో నిలుస్తూ, తెలుగు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది.