చెన్నైలోనూ మాయమవుతోన్న థియేటర్లు!

హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే అనేక థియేటర్లను కూల్చేశారు. కమర్షియల్‌ కాంప్లెక్సులు వస్తున్నాయి. తాజాగా చెన్నై నగరంలోని ప్రముఖ సినిమా థియేటర్‌ కాంప్లెక్స్‌లలో ఉదయం కాంప్లెక్స్‌ఒకటి. ఈ థియేటర్‌ త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనుంది. స్థానిక అశోక్‌ నగర్‌లో అశోక్‌ పిల్లర్‌, అశోక్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఈ థియేటర్‌ కాంప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్‌లు ఉన్నాయి.

ఉదయం, సూర్యన్‌, చంద్రన్‌లను మొదట నిర్మించగా, ఆధునికీకరణ పేరుతో ఉదయం థియేటర్‌లోని బాల్కనీ భాగాన్ని మినీ ఉదయంగా మార్చారు. స్థానిక అన్నాశాలైలో దేవి కాంప్లెక్స్‌, ఎగ్మోర్‌లోని ఆల్బర్ట్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌లకు ధీటుగా అశోక్‌ నగర్‌లో 1983లో ప్రారంభించిన ఉదయం కాంప్లెక్స్‌లో 41 యేళ్ళుగా ఎన్నో చిత్రాలను ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు.

అశోక్‌ నగర్‌ వాసులతో పాటు వడపళని, సైదాపేట, జాఫర్‌ఖాన్‌ పేట, కేకే నగర్‌, ఈక్కాడుతాంగల్‌, మాంబాళం, గిండి ప్రాంతాల్లోని ప్రేక్షకులకు ఈ కాంప్లెక్స్‌ ఎంతో అనువుగా ఉండేది. ఈ థియేటర్‌ను ఆరుగురు అన్నదమ్ములు నిర్మించారు. వీరంతా కలిసి థియేటర్‌ను విక్రయానికి పెట్టగా, 2012లో వీరిలో ఒక సోదరుడైన పరమశివం పిళ్ళై రూ. 80 కోట్లకు బిడ్డింగ్‌ వేశారు.

ఈ థియేటర్‌ వేలానికి రాగానే ఫౌండర్స్‌ ఫ్యామిలీ నుంచి 53 మంది షేర్‌ హోల్టర్స్‌ తెరపైకి రావడంతో న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడంతో ఈ థియేటర్‌ను కూల్చివేసి బహుళ అంతస్తుల్లో నివాస భవన సముదాయంతో పాటు షాపులను నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.