పుష్ప 2 అభిమానుల అత్యుత్సాహం.. లాఠీ కి పని చెప్పిన పోలీసులు!

ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదల అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అసలే మొదటి భాగం విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదల అవటంతో సినిమాపై ఎంతో ఆసక్తి పెంచుకున్న ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్ల పై దండయాత్ర చేశారు. రిలీజ్ కి ముందే కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో సినిమా విడుదల రోజున థియేటర్ల ముందు సినిమా ప్రేక్షకులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం సినిమా థియేటర్లు సందడి వాతావరణం నెలకొంది. అయితే కొన్ని హాల్స్ దగ్గర మాత్రం ప్రేక్షకుల అత్యుత్సాహం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడేలాగా చేసింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్ల అద్దాలు పగలగొడితే, మరి కొన్నిచోట్ల తోపులాట శృతిమించటంతో పోలీసులు లాఠీ జార్జి కూడా చేయవలసిన అవసరం ఏర్పడింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణమే ఏర్పడింది.

ప్రీమియర్ షో నేపథ్యంలో అభిమానులతో కలిసి సినిమా చూడటం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో సహా వస్తున్నాడని తెలిసిన అభిమానులు సినిమా ధియేటర్ దగ్గరికి చేరుకున్నారు. ఈలలు, కేకలు, గోలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సినిమా టికెట్ కొనుక్కునే వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన పోలీసులకి ఒకసారిగా అంతమంది జనాలని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు.

దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే అభిమానులని నియంత్రించేందుకు పోలీసులు చాలా వరకు ప్రయత్నించారని కానీ అభిమానులు ఎక్కడా తగ్గకపోవడంతో వారిని నియంత్రించేందుకే లాఠీ చార్జ్ చేయవలసి వచ్చిందని చెప్పారు పోలీసులు. ఈ తోపులాటకి తట్టుకోలేక ఒక మహిళ మృతి చెందిన సంగతి కూడా తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ అపస్మార్క స్థితిలో ఉన్నాడు.