పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా రాజా సాబ్. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుందని మేకర్స్ ముందుగా ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రభాస్ గాయం, షూటింగ్‌లో ఆలస్యం, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలు ఉన్నాయని సమాచారం.
ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజా సాబ్ రాకపోతే ఆ డేట్ కు మరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ చిత్రానికి పోటీనివ్వనుందని భావిస్తున్నారు. రాజా సాబ్ వస్తే ఈ సినిమా రాకపోవచ్చు.
అలాగే, నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రం కూడా ఇదే తేదీకి విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇప్పటికే నితిన్ రెండు సినిమాలపై పని చేస్తున్నారు, వాటిలో తమ్ముడు ఫిబ్రవరిలో విడుదల కావడంతో రాబిన్ హుడ్ ఏప్రిల్ విడుదలకు సిద్ధమవుతుందన్న ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఇక జాట్ అనే మరొక చిత్రం కూడా ఈ రోజునే విడుదలయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ గాయం కారణంగా రాజా సాబ్ ఆలస్యం కానున్న నేపథ్యంలో, అదే తేదీకి జాట్ ను రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.