YS Jagan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు కావడంతో ఎంతో మంది వైపాకా కీలక నేతలు పార్టీని వీడి బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే కూటమి పార్టీలలో చేరగా మరికొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలోనే తిరిగి తన పార్టీని బలపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు.
ఈయన తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరించిన కొంతమంది సీనియర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొని తిరిగి తన పార్టీని బలపరుచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైయస్ షర్మిల వ్యవహార శైలి నచ్చక ఎంతో మంది సీనియర్ నేతలు జగన్ చెంతకు చేరడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికీ ఎనిమిది మంది సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరటానికి సిద్ధమైనట్టు సమాచారం.
ఇలా కాంగ్రెస్ సీనియర్ నేతలను తన వైపుకు తిప్పుకొని ఏపీలో షర్మిల రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ తన టీం ఏర్పాటు చేసి ఏపీలో వైకాపా నుంచి బయటకు వస్తున్న నేతలను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. వారందరినీ కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారని సమాచారం.