అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా పౌరసత్వం పొందిన వారిలో 49,700 మంది భారతీయులు ఉండటం విశేషం. ఈ గణాంకాలు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా వెల్లడించబడ్డాయి. మెక్సికో 13.1 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలువగా, భారతీయులు 6.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నారు. ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాం దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ వంటి 10 ముఖ్య రాష్ట్రాల్లో 70 శాతం మంది భారతీయులు స్థిరపడ్డారు. ఎక్కువ మంది కుటుంబ ప్రాయోజిత వీసాలు లేదా ఉపాధి ఆధారిత కేటగిరీల ద్వారా పౌరసత్వం పొందారు. శరణార్థులు, డైవర్సిటీ ఇమ్మిగ్రేషన్ వీసా ప్రోగ్రామ్ ద్వారా వచ్చినవారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఇటీవల అమెరికాలో భారతీయుల సామాజిక, ఆర్థిక ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయిలో ఉన్న భారతీయులు, వ్యాపార రంగంలో రాణిస్తున్న వారు అమెరికన్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య గత పదేళ్లలో పెరుగుతూ వస్తోంది. 2022లో 65,960 మంది భారతీయులు పౌరసత్వం పొందగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. అమెరికాలో భారతీయుల ప్రాభవం, వారికున్న ఆర్థిక సామర్థ్యం అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను పెంచుతుందనడంలో సందేహం లేదు.