తెలంగాణలో బెన్ఫిట్ షో లకి పర్మిషన్లు ఉండవు.. రేవతి కుటుంబానికి పాతిక లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయం!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వారికి అల్లు అర్జున్ పాతిక లక్షలు ఇస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ పది లక్షలు ఇచ్చారు ఇంకా పదిహేను లక్షలు ఇవ్వాల్సి ఉంది. సుకుమార్ భార్య తబిత కూడా 5 లక్షలు ఆర్థిక సాయం అందించారు.

తాజాగా ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. శ్రీ తేజ్ తండ్రికి తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరుమీద 25 లక్షల చెక్ ని అందించారు. అంతేకాకుండా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. బాలుడు చికిత్స కోసం ప్రభుత్వమే వైద్య ఖర్చులు చెల్లిస్తుందని చెప్పారు.

ఇక పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన కి అల్లు అర్జున్ రావటమే కారణం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక హీరో తన సినిమా చూసేందుకు ధియేటర్ కి రావడంతో ఒక మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు, అటువంటి సమయంలో ఆ హీరో రూఫ్ టాప్ నుంచి అభిమానులకి అభివాదం చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు.

ఈ సంఘటనపై ప్రభుత్వం సదరు హీరో పై థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వమని, టిక్కెట్ల రేటు పెంపుకి కూడా అనుమతి ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. బాలుడు కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదు అన్నారు.