RGV: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు తన దర్శకత్వంలో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కాలంలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసేవారు. కానీ రాను రాను అలాంటి సినిమాలు కరువయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే రాంగోపాల్ వర్మ తరచు ఎవరో ఒకరిపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అలాగే సినిమా ఇండస్ట్రీలో జరిగే పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు వర్మ. ఇప్పటికే చాలా అంశాలలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో నిలిచారు రాంగోపాల్ వర్మ.ఆ వివరాల్లోకి వెళితే.. గతంలో రాంగోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తీసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ప్రభుత్వం, ఏపీ ఫైబర్ నెట్ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ డబ్బులు వ్యూహం సినిమాకు గాను ఆర్జీవికి చెల్లించారని తాజాగా ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ ఆర్జీవికి, అప్పటి ఫైబర్ నెట్ ఎండీకి, మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందినందుకు ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు ఇచ్చాము. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయి. వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11 వేల రూపాయలు చెల్లించారు. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై వివరణ కోరుతూ డైరెక్టర్ ఆర్జీవీకి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.