సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా చాలా కష్టపడుతున్నాడు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అవసరం లేదు. కానీ, సినిమాలెందుకు దెబ్బ తింటున్నాయ్.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.
ప్రతి సినిమా విషయంలోనూ అంతకు మించిన ‘అతి’ చేసేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అదే అసలు సమస్య. ‘ది ఫ్యామిలీ స్టార్’ విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి, మంచి పాయింట్‌నే ఎంచుకున్నాడు దర్శకుడు. సినిమా బాగానే మొదలైంది. చివరికి వచ్చేసరికి తేలిపోయింది.
సినిమా అంతా సాగదీతే. ఎడిటింగ్ టేబుల్ దగ్గర సినిమాని దర్శకుడు, నిర్మాత, హీరో.. చూసుకోలేదా.? అన్న డౌట్ సినిమా చూసిన చాలామందికి వచ్చింది. సరే, అది వేరే సంగతి. ప్రోడక్ట్ ఔట్ పుట్ తెలిశాక, పబ్లిసిటీ విషయంలో జాగ్రత్త పడాలి కదా.! అదీ లేదు.
ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలానే ప్రోమోస్ వున్నాయి. సినిమాలో కంటెంట్ పరంగా ఎక్కడా వల్గారిటీ లేదు. కానీ, సాగతీత.. అర్థం పర్థం లేని సన్నివేశాలు సినిమాని నిండా ముంచేశాయి. ‘సినిమాని సినిమాటిక్‌గానే తీయాలి’ అంటూ నిర్మాత దిల్ రాజు, సినిమా విడుదలయ్యాక కవరింగ్ డైలాగులు చెబుతున్నాడు.
సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన అతి మాటలకు, ఆయనా ట్రోల్ అవుతున్నాడు, సినిమా కూడా ట్రోలింగ్కి గురవుతోంది. ఈ ‘అతి’ విజయ్ దేవరకొండ తగ్గించుకోకపోతే కష్టమే.