సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటని కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేసు, లగచర్ల ఘటనలపై ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పేర్కొన్నారు.
ఇక ఈ-కార్ రేసింగ్ వ్యవహారంపై తాను చర్చకు సిద్ధమని.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సహా పలువురు నేతలు సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చు అని మీరు ఆరోపించిన స్కాములు, ఫార్ములాలు అన్నింటిని చర్చిద్దామన్నారు. సర్కార్‌కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు. పుష్ప టు మూవీ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే సమయంలో రేవంత్ పేరు మర్చిపోయారని.. దీంతో సీఎం ఇగో హర్ట్ అయి ఆయన్ను అరెస్ట్ చేయించారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడుతూ సినిమా యాక్టర్ అల్లు అర్జున్.. ఓ ఈవెంట్‌లో ఈయన పేరు మర్చిపోయిండు.
తెలంగాణ సీఎం అని చెప్పి.. కాసేపు అటూ ఇటూ చూసిండు. మనోనికి ఆయింత ఎక్కడ్నో తగిలింది. గింత అన్యాయామా..? నీ పేరు మర్చిపోతే జైల్లో పెడ్తవా..? గట్ల తయారైండు.’ అని వ్యాఖ్యనించారు.సంధ్య థియేటర్ ఘటనలో వైఫల్యాలపై.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పా.. మిగతా పార్టీలన్నీ బన్నీ అరెస్టును తప్పుబడుతున్నాయి.