అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ అన్నట్లుగా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి మారిపోయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, ఆల్ మోస్ట్ చంద్రబాబుతో సమానంగా రాజకీయ అనుభవం ఉన్న కన్నాకు ప్రస్తుతం టీడీపీలో దక్కుతున్న స్థానంపై రకరకాల గాసిప్స్ రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు కన్నా పరిస్థితి… పొమ్మనలేక పొగబెడుతున్నారా అనే స్థాయిలోకి మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరు. మంత్రిగా అనేక సార్లు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఆయన… రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాపుసామాజికవర్గానికి చెందిన కన్నాను గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేని పరిస్థితి. మరోపక్క అదేజిల్లాలో కమ్మ సామాజికవర్గానికి చెందిన రాయపాటి సాంబశివరావు తో కన్నాకు ఎప్పటినుంచో పోరు ఉందని చెబుతుంటారు.
అలాంటి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. రాయపాటిని సైతం కాదని కన్నాకు ఆ ఛాన్స్ ఇచ్చారా.. లేక, ఆయన్ను బుజ్జగించొచ్చులే అని బాబు భావించారా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే… టీడీపీలో జాయిన్ అవుతున్నప్పుడు కన్నాలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… కన్నా లక్ష్మీనారాయణ ఏమై పోయారబ్బా అంటూ టీడీపీ నేతలే చర్చించుకోవడం గమనార్హం.
వాస్తవాన్నికి గతంలో చంద్రబాబుకూ కన్నా లక్ష్మీనారాయణకు అస్సలు పడేది కాదనేది తెలిసిన విషయమే. వైఎస్సార్ వర్గంగా పేరొందిన కన్నా… చంద్రబాబుపై అసెంబ్లీలోనూ, బయటా తీవ్రస్థాయిలో ఫైరయ్యేవారు. ఆయన ఆస్తులపై కోర్టులో కేసు కూడా వేశారు. అయినప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ… కండువా కప్పించుకున్నారు, బాబు కూడా అదే స్మైల్ తో కండువా కప్పి సైకిల్ ఎక్కించుకున్నారు.
పార్టీలో చేరిన తర్వాత కూడా కన్నాకు టీడీపీ బాగానే ప్రయారిటీ ఇచ్చింది. ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఇదే సమయంలో సత్తెనపల్లిలో పార్టీని, కేడర్ ను కాపాడిన కోడెల కుటుంబాన్ని సైతం కాదని ఆ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కన్నాను నియమించింది. దీంతో కన్నా కూడా సత్తెనపల్లిలో తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ… స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయి జైలుకెళ్లిన అనంతరం కన్నా గొంతు మూగబోయిందని అంటున్నారు. బాబూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ ఆయనతో ములాఖత్ కాకపోవడం కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే… దీనికంతటికీ కారణం పవన్ కల్యాణ్ అని అంటున్నారు పరిశీలకులు.
అవును… ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీడీపీ బహిరంగంగా దగ్గరయిన తర్వాత కన్నాను దూరం పెడుతున్నారని అంటున్నారు. కన్నా కూడా ఆ దిశగానే భావిస్తున్నట్లుందని చెబుతున్నారు. చివరకు కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారని ఆయన ఫాలోవర్స్ ఫీలవుతున్నారంట. కీలక సమావేశాలలో బాలకృష్ణ, యనమల, అచ్చెన్నాయుడు వంటి నేతలు పాల్గొన్నా అభ్యంతరం లేదు కాని, పట్టాభి లాంటి నేతలు కూడా పాల్గొంటూ, తనకు మాత్రం ఆహ్వానం లేకపోవడదన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం.
పరిస్థితి ఇలానే కొనసాగితే… జనసేన పార్టీలో చేరిక విషయంలో పవన్ కల్యాణ్, కన్నాపై గుర్రుగా ఉన్నారని.. ఇప్పుడు టీడీపీ – జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోవడంతోపాటు.. ప్రస్తుతం బాబు లోపల ఉండటంతో పవనే మెయిన్ రోల్ పోషిస్తున్న తరుణంలో… కన్నా పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఎన్నో డక్కా మొక్కీలు తిన్న కన్నా… ఈ అవమానాలన్నీ భరిస్తూ కంటిన్యూ అయిపోతారా.. లేక, పాత గూటివైపు చూస్తారా అనేది వేచి చూడాలి!