రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా ప్రారంభమయ్యాయి. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా యూఎస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నెల 21న యూఎస్‌లో నిర్వహించబోయే ఈ ఈవెంట్‌కి చిత్ర బృందం మొత్తం హాజరవుతుంది. ఈ సందర్భంగా నాలుగో సింగిల్‌ను విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ తరహాలోనే భారీ ఈవెంట్స్ ద్వారా గేమ్ ఛేంజర్‌కు మరింత హైప్ తీసుకురావాలని నిర్మాతల ప్రణాళిక. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బెన్ ఫిట్ షోలపై కూడా చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ కోసం ప్రత్యేకంగా బెన్ ఫిట్ షోలు ఉంటాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అయితే, ‘పుష్ప 2’ సందర్బంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండగకు విడుదలవుతున్న ఈ సినిమా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తొలి ప్రాజెక్టు కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు మాటల ప్రకారం, గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, బెన్ ఫిట్ షోలు ప్రేక్షకులను థియేటర్‌లకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. టికెట్ ధరలపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, సినిమా ప్రీ రిలీజ్ హైప్ మాత్రం మరో స్థాయికి వెళ్లింది.