Virat Kohli: కుటుంబం కోసం విరాట్.. మీడియాపై ఆగ్రహం

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా మెల్బోర్న్ విమానాశ్రయంలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియా మీడియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు కోహ్లీ కుటుంబ ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం కోహ్లీకి ఆగ్రహానికి కారణమైంది. కుటుంబ ప్రైవసీని ఉల్లంఘించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “మీరు మా అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు ఎలా తీయగలరు?” అంటూ ఆమెను ప్రశ్నించిన కోహ్లీ, మీడియా ప్రవర్తనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కొంతమంది నెటిజన్లు కోహ్లీని సమర్థిస్తుండగా, మరికొందరు ఆయన ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం కూడా గౌరవించబడాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

విరాట్ కోహ్లీకి ఇదే మొదటి సందర్భం కాదు. గతంలోనూ తన వ్యక్తిగత జీవితంపై మీడియా ఆసక్తిని చూసి కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవసీ విషయంలో స్పష్టమైన వైఖరి కలిగిన కోహ్లీ, కుటుంబాన్ని మీడియా కళ్లకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుండడం అందరిలో చర్చకు దారి తీసింది.