Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: ఒప్పందానికి వచ్చిన పాక్.. హైబ్రిడ్ మోడల్ లొనే భారత్ మ్యాచ్‌లు

2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పద్ధతిపై అనేక నెలలుగా కొనసాగిన అనిశ్చితి ఎట్టకేలకు సద్దుమణిగింది. ఐసీసీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌ ఇప్పటికే పాక్‌లో భద్రతా కారణాలపై ఆందోళన వ్యక్తం చేయగా, పాక్ తమ షరతులను ముందు పెట్టింది.

ఈ మోడల్ ప్రకారం, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. పాక్ తొలుత ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిలిచినా, చివరికి ఒప్పుకుంది. కానీ, భారత్‌ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాల్సిందేనని షరతు పెట్టింది. అంటే పాకిస్థాన్ లో ఆడకుండా ఇండియా దుబాయ్ లో లేదా ఇతర దేశాల్లో మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంటుంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, 2028 టీ20 ప్రపంచ కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నిబంధనలు వర్తిస్తాయని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ భారత్‌లో, 2026 టీ20 ప్రపంచ కప్ భారత్-శ్రీలంకల ఆతిథ్యంలో జరగనున్నాయి. ఈ టోర్నీలకు పాకిస్థాన్ తటస్థ వేదికలపై మాత్రమే పాల్గొంటుంది. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య సున్నితమైన సంబంధాల ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ త్వరలో ఖరారు చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది.