YS Jagan: ప్రజా సమస్యలపై పోరాటానికి సమయం ఆసన్నం: జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ తన పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రజా సమస్యలపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో నిలిచిపోయిందని విమర్శించారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వం హామీలను విస్మరించి ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పారు.

ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులుగా దృఢంగా నిలబడాలని జగన్ సూచించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం ప్రతి నాయకుడు ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజల తరపున తమ గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. తన హయాంలో నమ్మకాన్ని నిదర్శనంగా చూపిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని గుర్తు చేశారు.

ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని జగన్ అభిప్రాయపడ్డారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, కేవలం సాకులు చెప్పడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా పథకాలు, సబ్సిడీలు ప్రజలకు అందడం లేదని, కరెంట్ ఛార్జీలు వంటి వివిధ రూపాల్లో ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.

చంద్రబాబు పాలన పూర్తిగా అవినీతి, మోసాలపై ఆధారపడిందని జగన్‌ ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడమే ప్రస్తుతం మన ప్రధాన లక్ష్యమని జగన్ స్పష్టంచేశారు.