ఆదివారంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారాహియాత్రం ముగిసింది. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఎంటరవ్వబోతోంది. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన సభ జరిగింది. ఈ ముగింపు సభలో పవన్ వీరావేశం తెచ్చుకున్నారు. కుల ప్రస్థావన లేకుండా రాజకీయ ప్రసంగం చేయలేని పవన్… ఈ సభలోనే అదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలికిపురంలో సభలో కూడా ఆవేశంగా మాట్లాడారు. తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోనుంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదని, తన ఒంటిపై రాయిపడితే తానేంటో చూపిస్తానని పవన్ అన్నారు. తాను రౌడీలకు భయపడే రకం కాదని, తానొక విప్లవకారుడినని, విప్లవ పంథాలో ఉన్న రాజకీయ నాయకుడినని పవన్ పేర్కొనడం గమనార్హం.
రాజకీయ విమర్శల్లో మరీ దిగజారిపోతున్నారనే ఆరోపణను ఎదుర్కొంటున్న పవన్… ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా… కుల మతాలను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం ఆధ్యంతం కొనసాగింది. ఈ క్రమంలో… అంతర్వేది రథాన్ని వైసీపీ క్రిమినల్స్ కాల్చేశారని, చివరకు ఆ నెపం పిచ్చోడిపై నెట్టేశారని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఇదే సమయంలో ఏపీలో దేవాలయాలపై 219 ఘటనలు జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని పవన్ అన్నారు.
కారు డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించిన పవన్… ఆనాడు తాను దళితులకు అండగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు. ఇక, గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూస్తామని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా… క్రిమినల్స్ ను వదిలేస్తే మహిళల మానప్రాణాలకు రక్షణ ఉండదని పవన్ చెప్పడం కొసమెరుపు!
జనసేన అధికారంలోకి వస్తే తిరుమల శ్రీవాణి ట్రస్టు అవకతవకలపై విచారణ జరిపిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఈ ట్రస్టుపై ఇప్పటికే టీటీడీపీ శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు.. ట్రస్టుపై అవాకులూ చెవాకులూ పేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా.
ఇక కోనసీమ రైల్వే లైన్, సఖినేటిపల్లి – చించినాడ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని పవన్ చెప్పడం గమనార్హం. సుమారు గత 25 – 30 ఏళ్లుగా ప్రతీ రాజకీయ నాయకుడూ చెప్పే మాటల్లో ఇదొకటి. కృషి చేస్తానని. అంతా అంటున్నారు, అన్నారు.. తాను అనకపోతే బాగోదని భావించారో ఏమో కానీ… పవన్ కూడా ఆ హామీ ఇచ్చేశారు. కోనసీమకు రైల్వే లైన్ అని చెప్పుకొచ్చారు!
ఏది ఏమైనా… ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 12 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో మొదటి దశ యాత్ర పూర్తి చేశారు పవన్. ఈ యాత్రవల్ల జనసేనకు మైలేజ్ వచ్చిందా.. కొత్తగా డ్యామేజీ అయ్యిందా అనే చర్చ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో బలంగా జరుగుతుంది.