Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూలీ సినిమా 70 శాతం పూర్తయిందని, ఈ నెల 13నుంచి 28వరకు థాయిలాండ్‌లో తదుపరి షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కానీ, ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌పై రాజకీయ ప్రశ్నలు వేయడం చర్చనీయాంశమైంది. చెన్నై అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన గురించి ఒక విలేకరి మహిళల భద్రతపై రజనీకాంత్ అభిప్రాయం అడిగారు. దీనికి సూపర్ స్టార్ ఘాటుగా స్పందించి, తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని, ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా రజనీకాంత్ రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పారు.
ఇక కూలీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ లియో తర్వాత ఈ ప్రాజెక్ట్ తీసుకుంటుండటంతో కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ కెరీర్‌లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం అనంతరం ఆయన జైలర్ 2లో పాల్గొనే అవకాశముందని సమాచారం. జైలర్ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రజనీకాంత్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. వరుస ప్లాపుల తర్వాత వచ్చిన ఈ హిట్ ఆయనకు ఎంతో బలాన్నిచ్చింది. కూలీ సినిమాపై కూడా ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.