Sundeep Kishan: వాటి కోసం మంచి ఆఫర్లు వదిలేసాను.. చివరకు నన్నే పక్కన పెట్టేశారు: సందీప్ కిషన్

Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. తెలుగు ఇటీవల కాలంలో సందీప్ కిషన్ సరైన సక్సెస్ సినిమా అందుకొని చాలా రోజులు అవుతోంది. ఇక చివరిగా తెలుగులో ఊరి పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే హీరో సందీప్ కు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎదురైన ఘోర చేదు అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు. కాగా హీరో సందీప్ మొదట షోర్‌ ద సిటీ 2010 అనే మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. 2019లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ తో మరోసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఓటీటీ మాధ్యమం ద్వారా పలకరించాడు. హిందీలో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. షోర్‌ ఇన్‌ ద సిటీ సినిమా కంటే ముందే నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. ఆ రెండూ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల బ్యానర్‌ లో కావడంతో చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. నేను అనుకుందొకటైతే జరిగింది మరొకటి. రెండేళ్లపాటు ముంబైలో ఖాళీగా కూర్చున్నాను. ఆ సమయంలో ఒక తమిళ్‌, రెండు తెలుగు చిత్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ ఆసక్తి చూపించలేదు.

ఆల్‌రెడీ హిందీలో రెండింటికి సంతకం చేసినందున వేరే ఆఫర్లను వదిలేసుకున్నాను. పోనీ ఇంత చేసినా నాకేమైనా ఉపయోగం ఉందా? అంటే అదీ లేదు! నన్ను అంతకాలం వెయిట్‌ చేయించి చివరి నిమిషంలో ఆ సినిమాల్ని వేరే వారితో మొదలు పెట్టారు. మోసపోయాను అనిపించింది. అందుకే దక్షిణాది ఇండస్ట్రీలోనే నిజాయితీగా ఉండాలని అనుకున్నాను. ఇక్కడే కొనసాగుతున్నాను. అలా అని బాలీవుడ్‌ లో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకోలేదు. కాకపోతే కేవలం హిందీ భాష కోసం అక్కడ సినిమాలు చేయాలనుకోవడం కరెక్ట్‌ కాదనిపించింది. నా భాషలోనే సినిమాలు చేస్తాను. అది అందరికీ నచ్చుతుందనుకుంటే హిందీలోనూ రిలీజ్‌ చేస్తాను. ఇప్పుడందరూ చేస్తుందదేగా! అని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.