ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కౌంట్‌డౌన్ మొదలైంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మను సారథిగా కొనసాగించనున్నట్లు సమాచారం. అయితే, వైస్ కెప్టెన్ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెడతారనే ఆసక్తి ఎక్కువైంది. తాజా కథనాల ప్రకారం, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
బుమ్రా గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా ఎక్కువగా పరిగణనలోకి రాలేదు. కానీ, ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి తన నాయకత్వ ప్రతిభను నిరూపించాడు. ఇందులో భారత్ గెలిచిన ఏకైక టెస్ట్‌కు బుమ్రానే సారథి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమిస్తే జట్టు కోసం మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
మునుపటి కోచ్ రాహుల్ ద్రావిడ్ కాలంలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఈ బాధ్యత శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. కానీ, బుమ్రా ఫిట్‌నెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తుండటంతో అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయపడ్డ బుమ్రా, ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 6నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయవంతంగా పోటీ చేయడం కోసం బుమ్రా నాయకత్వంలో కీలకపాత్ర పోషించనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.