తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో ఐదు రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ – జనసేన తరుపున పవన్ కల్యాణ్ ప్రచారాని దిగారు. ఇందులో భాగంగా ముందుగా బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసిపెట్టారు. అటు అధికార బీఆరెస్స్ ను కానీ, ఇటు ప్రత్యర్థి కాంగ్రెస్ ను కానీ ఒక్కమాట అనకుండా ఉన్నంతలో అంటీముట్టనట్లు మమ అనిపించేశారనే అనుకోవాలి!
ఆ సంగతి అలా ఉంటే… ఈ ప్రసంగంలో తెలంగాణాలో బీసీ సీఎం ని చూడడం తన ధ్యేయమని అది బీజేపీతోనే సాధ్యమని.. తెలిపారు. అంటే బీజేపీ ఇచ్చిన హామీనే నొక్కి చెప్పారన్నమాట. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే… ఏపీలో పవన్ ప్రసంగాల్లో కనిపించే ఆవేశం, అయాసం మచ్చుకైనా ఇక్కడ కనిపించకపోవడం. పైగా ఎన్నికలకు వారం ముందు జరుగుతున్న సభలో కూడా పవన్ ఇలా ప్రసంగించడం చప్పగా ఉందని అభిమానులు వాపోతున్నారు.
ఇక్కడ ప్రధానంగా ఒక అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తూ… బీసీ సీఎంని చూడటమే తన లక్ష్యం అని చెప్పుకుంటున్న పవన్… ఏపీలో మాత్రం కాపు సీఎం అని ఎందుకు అనడం లేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏపీలో జనసేనకు ఆ మాత్రం ఆదరణ ఉందంటే అందుకు కారణం… కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు కాకుండా మరో వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనే!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితే వస్తే… కచ్చితంగా కాపు సీఎం నినాదంతో వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోలాగా బీజేపీ – జనసేన కలిసే వెళ్తాయా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి! కారణం… టీడీపీతో అంటకాగడానికి బీజేపీ సిద్ధంగా లేదని చెబుతుండటమే. అయితే 2014 తరహాల్లో కలిసి వెళ్లాలని మాత్రం జనసేన కోరుకుంటుందని చెబుతున్నారు.
ఏపీ ఎన్నికల్లో కాపు సీఎం అనే నినాదం బీజేపీ తీసుకుని వస్తే కచ్చితంగా ఆ సామాజికవర్గ ఓట్లు చీలతాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే టీడీపీ-జనసేన కూటమికి ఓటేస్తే కాపు సీఎం అవ్వడని మిగిలినవారికంటే ఎక్కువగా కాపులకి తెలుసు! ఆ కూటమికి ఓటేసి మళ్లీ కమ్మవాడైన చంద్రబాబుకి బలాన్నిచ్చే కన్నా “కాపు సీయం” సెంటిమెంటుకి బీజాన్ని నాటిన బీజేపీకి ఓటేయొచ్చు కదా అనే ఆలోచన ఆ సామాజికవర్గంలో మొదలైతే అది టీడీపీ-జనసేన కూటమి పొత్తుకు పెద్ద దెబ్బే అని అంటున్నారు పరిశీలకులు.
కారణం… ఏపీలో అటు జనసేన – టీడీపీ… ఇటు వైసీపీ మధ్య పోరు జరిగితేనే చంద్రబాబు కలలు ఎంతో కొంత నెరవేరే అవకాశాలుంటాయని అంటున్నారు. అలాకానిపక్షంలో మధ్యలో కాపు సీఎం అని బీజేపీ ఎంటరయ్యి.. ఆ సామాజికవర్గ ఓటర్లను కలుపుకుపోయే పరిస్థితులే వస్తే మాత్రం… జగన్ నెత్తిన పాలుపోసినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.
మరి ఏపీలో కాపు సీఎం నినాదానికి బాబు ఒప్పుకుంటారా… ఒప్పుకుంటే ఆ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకుంటున్న సామాజికవర్గం అంగీకరిస్తుందా… ఒకవేళ ఎన్నీకలయ్యేవరకైనా అలా చెప్పి పబ్బం గడుపుకుందామన్నా, కాపులు చంద్రబాబు మాట నమ్ముతారా… ఇన్ని ప్రశ్నల మధ్య తెలంగాణ ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో మొదలవ్వబోయే రసవత్తర రాజకీయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!