అడవిలో ఎవరు లేని కారులో ఊహించని ధనం దర్శనమిచ్చింది. భోపాల్ నగర శివార్లలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశమంతా అందరిని షాక్ కు గురి చేసింది. సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ, లోకాయుక్త పోలీసుల సంయుకంగా కొన్ని చోట్ల నిర్వహించిన దాడులు ఊహించని వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఇక అధికారులకు దొరికితే ఏమవుతుందని అనుకున్నారో ఏమో గాని ధనంతో ఉన్న కారును అడవిలో వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఇన్నోవా కారును అధికారులు గుర్తించారు. అయితే, కారును చుట్టుముట్టిన 100 మంది పోలీసుల బృందం తనిఖీ చేయగా, అందులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు ఎవరిదో తెలియకపోయినా, సౌరభ్ శర్మ అనే వ్యక్తి పేరు విచారణలో ప్రధానంగా వినిపిస్తోంది.
సౌరభ్ శర్మ గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసి, ప్రస్తుతం ఆడిటింగ్ రాడార్‌లో ఉన్నాడని సమాచారం. అతని భోపాల్ నివాసంపై గతంలో దాడులు జరిపిన అధికారులు రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో లభించిన బంగారం, నగదు సౌరభ్ శర్మతో సంబంధముండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ అంశంపై ఇంకా ఎవరూ తమ హక్కును పేర్కొనకపోవడం విచారణను మరింత గందరగోళంలోకి నెడుతోంది. ఇదివరకు సౌరభ్ శర్మ గ్వాలియర్ ప్రాంతానికి చెందిన బిల్డర్లతో సంబంధం కలిగి ఉండడం, అతని ఆస్తులు అనుమానాస్పదంగా పెరగడం అధికారులు గుర్తించారు. అడవిలో లభించిన బంగారం, నగదు వెనుక ఉన్న అసలు కథ దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటన భోపాల్ నగరంలో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.