KTR: అది నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ‘రైతు భరోసా’ అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకత్వానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘‘రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను’’ అని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

కేటీఆర్ తన ప్రసంగంలో, ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించింది. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. ఇప్పటికీ రూ.26 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది’’ అని ఆరోపించారు. ‘‘రైతుల కోసం పోరాటం చేయాలని, వారి హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ముందుకు రావాలని సూచించారు.

ఇదే సమయంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను ప్రస్తావించారు. ‘‘మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు అందించామని, రైతుల కోసం ఎప్పటికీ పాటుబడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలను కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలు ఆలోచించాలని కోరారు.

అసెంబ్లీలో కొనసాగుతున్న ఈ చర్చ రైతుల సమస్యలపై మరింత దృష్టిని ఆకర్షించింది. రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఎంతవరకు బాధ్యతతో ఉందో చూపించాలనే కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తన వంతు పోరాటం చేస్తుందని, అసెంబ్లీలో రైతుల హక్కుల కోసం ఆవాజ్ వినిపిస్తామని స్పష్టం చేశారు.