కూటమిలో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో టీడీపీ – జనసేన కేడర్ మధ్య కొంతకాలంపాటు సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. జనసేన నుంచి కందుల దుర్గేష్ కు టిక్కెట్ కన్ ఫాం అని జనసైనికులు ఫుల్ హ్యాపీగా ఉన్న సమయంలో.. స్థానాన్ని టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. దీంతో… కూటమి పార్టీల్లోని జనసేన కేడర్ లో ఈ విషయంపై కాస్త అసంతృప్తి నెలకొంది! మరోపక్క వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణు బరిలోకి దిగుతుండటంతో… పోరు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చూద్దాం…!
2009లో ఏర్పడిన ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఆ ఎన్నికల్లో చందన రమేష్ గెలుపొందగా.. 2014, 2019 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్యపైకి బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి వేణుని దింపారు జగన్. అందుకు ఇక్కడ ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెబుతారు. వాస్తవానికి ఇక్కడ కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువే అయినప్పటికీ… అంతకంటే కాపులు, బీసీల ఆదిపత్యం ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ ని బరిలోకి దించారు జగన్. దీంతో… ఎస్సీ, క్రీస్టియన్, ముస్లిం మైనారిటీ ఓట్లతో పాటు బీసీల ఓట్లు కూడా వీలైనంత ఎక్కువగా పడతాయని భావించారని అంటారు. ఇదే సమయంలో… జక్కంపూడి రామ్మోహన్ రావుకు అత్యంత సన్నిహితుడైన, సొంత మనిషిలా వేణుని భావిస్తుండటంతో బీసీ సామాజిక వర్గంతోపాటు కాపుల నుంచీ ఆదరణ దొరికే అవకాశం ఉందని అంటున్నారు.
అదేవిధంగా… కందుల దుర్గేష్ కి టిక్కెట్ రాకపోవడంతో అక్కడున్న జనసైనికులు, కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది ప్రజానికం గుర్రుగా ఉన్నారని.. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా బుచ్చయ్య చౌదరిపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో… రాజామండ్రి రూరల్ వేణుకి కత్తిమీద సామైతే కాదని.. అలా అని పూలబాట కూడా కాదని చెబుతున్నారు.
ఇక బుచ్చయ్య చౌదరి విషయానికొస్తే… ఈసారి అంత ఈజీకాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగం వరుసగా రెండుసార్లు గెలవడం, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగా ఏర్పడే వ్యతిరేకత వల్ల ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి పరిస్థితులు ఏమేరకు సానుకూలంగా ఉంటాయనేది చూడాలి! మరోపక్క కందుల దుర్గేష్ అనుచరుల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఏదేమైనా మాత్రం గోరంట్ల తన కేడర్ ను ఆయుధంగా మార్చుకుని ఎన్నికల బరిలోకి విజయం సాధించేందుకు అడుగులు వేస్తారనడంలో సందేహమే లేదు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ ఓటర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది వేచి చూడాలి!