Allu Arjun – Trivikram: అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ.. ఆ హీరోయిన్ ఫిక్స్?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వరుస హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో బిగ్ హిట్ కోసం ప్లాన్ చేస్తోంది. ఇక కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేస్తారనే వార్తలు మొదట వినిపించాయి. అల వైకుంఠపురములో వంటి విజయవంతమైన కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటారని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.

మీనాక్షి చౌదరి తన కెరీర్ ప్రారంభంలో పెద్దగా విజయాలు సాధించలేకపోయినా, ఆ తరువాత విజయ్, మహేశ్ బాబు, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పనిచేస్తూ గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రం ఆమెకు మంచి విజయాన్ని అందించింది. అంతేకాకుండా, వెంకటేశ్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం జనవరిలో విడుదలకానుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో, త్రివిక్రమ్ వంటి టాలెంటెడ్ దర్శకుడితో మీనాక్షి పని చేయడం ఆమె కెరీర్‌ కొత్త మలుపు తిరిగే అవకాశముంది. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుందని సమాచారం.