మూడే ఆప్షన్స్… పవన్ ఆలోచనల్లో అర్ధముందా?

సినిమాలో డైలాగులకీ, నిజ జీవితంలోని ప్రవర్తనకూ ఎంతో తేడా ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో హీరోలు… “భయం” అనే డైలాగును బలంగా వాడుతుంటారు.. తమకు భయం అనేది ఉండదని.. భయానికి మీనింగ్ తెలియదని.. తమ డిక్షనరీలో భయం అనే పదమే లేదని రకరకాల డైలాగులు పేలుస్తారు! కానీ నిజ జీవితంలో అది అంత ఈజీ కాదని చెప్పే సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తుంటాయి.. ఈ సమయంలో పవన్ పేరు తాజాగా తెరపైకి రావడం గమనార్హం.!

పొత్తులో భాగంగా జనసేనకు తొలుత 24 + 3 స్థానాలు దక్కగా… చివరికి అవి 21 + 2 గా మిగిలాయి. ఆ 21లో కూడా టీడీపీ నుంచి టిక్కెట్ కోసం బాబు జనసేనలోకి పంపినవారూ లేకపోలేదనే కామెంట్లూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. నెక్స్ట్ లిస్ట్ కూడా రెడీ చేశారు.

ఇక ఈ నెల 16న ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వేదికగా జగన్.. తన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. మరోపక్క జనసేన అధినేత సీట్ల పంపకాల సమయంలోనే 5 గురిని ప్రకటించి.. అనంతరం కందుల దుర్గేష్ ని నిడదవోలుకు పంపిన విషయాన్ని ప్రకటించారు. అక్కడికి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఫైనల్ కాగా… తాజాగా మరో తొమ్మిది మందిని పవన్ ఖరారు చేశారు.

ఇందులో భాగంగా… పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిలి నుంచి విజయకుమార్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు లకు సీట్లను కన్ఫర్మ్ చేశారు.

అంటే ఉన్న 21 స్థానాల్లోనూ 15మంది అభ్యర్థులను కన్ ఫాం చేసేశారన్నమాట. ఇక మిగిలిన సీట్లు 6మాత్రమే. అవి అమలాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, అవనిగడ్డ, పాలకొండ, రైలే కోడూరు అని చెబుతున్నారు. వీటిలో అమలాపురం, రైల్వే కోడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. పాలకొండ ఎస్టీ రిజర్వేడ్. ఇక మిగిలింది పిఠాపురం, రామచంద్రాపురం, అవనిగడ్డ స్థానాలు మాత్రమే.

అంటే… ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తే ఈ మూడు నియోజకవర్గాల్లోనే ఎక్కడో ఒక చోట నుంచి పవన్ పోటీ చేయాలి. లేదు వస్థున్న కథనాలను నిజం చేస్తూ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడమే మిగిలి ఉంటుంది. అయినప్పటికీ… ఆప్షన్స్ ఇక మూడే ఉన్నప్పటికీ… తాను పోటీ చేసే స్థానం విషయంలో మాత్రం పవన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. దీంతో రకరకాల విశేలేషణలు తెరపైకి వస్తున్నాయి.

వైఎస్ జగన్ ఈ నెల 16న తన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన అనంతరం తాను పోటీ చేసే స్థానం విషయంలో పవన్ ఒక క్లారిటీకి వస్తారని.. పిఠాపురంలో ముద్రగడ ఫ్యామిలీ రంగంలోకి దిగితే ఆ విషయంలో పునరాలోచించుకుంటారని.. అనంతరం రామచంద్రాపురం వైపు చూసే అవకాశం ఉందని.. ఇవన్నీ ఎందుకు అనుకుంటే… కాకినాడ లోక్ సభ స్థానానికే పరిమితమవుతారని అంటున్నారు.

ఈ సమయంలో ఇది పవన్ కల్యాణ్ వ్యూహంలో భాగమని కొంతమంది అంటుంటే… ఇది భయమని, ఆ భయానికి అర్ధం లేదని, పవన్ పోటీ చేసే స్థానం ఫైనల్ అయిన తర్వాత అయినా దానికీ తగ్గట్లుగా జగన్ అభ్యర్థిని మార్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు మరికొంతమంది. మరి పవన్ 16వ తేదీ తర్వాత అయినా తాను ఎక్కడనుంచి పోటీచేసేదీ చెబుతారా.. లేక, మరింతకాలం భయానికి వ్యూహం అని పేరెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తారా అనేది వేచి చూడాలి!