రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు జగన్. దీంతో ఈసారి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి భరత్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రచారాలతోనూ, టీవీ డిబేట్లలోనూ హోరెత్తించేస్తున్నారు. మరోపక్క అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు కూటమి తరుపున టీడీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. దీంతో… ఇద్దరు యువనేతల మధ్య రసవతర పోరుకు రాజమండ్రి అర్బన్ వేదిక కానుంది!
అవును… ఏపీ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో రాజకీయం మంచి కాకమీద కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తరఫున యువనేతలే తలపడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసి ఎంపిగా భారీ మెజారిటీతో గెలిచిన భరత్.. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండగా.. తన భార్య స్థానంలో ఆదిరెడ్డి వాసు రంగంలోకి దిగుతున్నారు.
వాస్తవానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏ పార్టీకి కంచుకోట కాదనే చెప్పాలి. ఇక్కడ నుంచి 2009లో రౌతు సూర్యప్రకాశ్ (కాంగ్రెస్), 2014లో ఆకుల సత్యనారాయణ (బీజేపీ), 2019 ఆదిరెడ్డి భవానీ (టీడీపీ) గెలుపొందారు. ఈ నేపథ్యంలో 2024లో ఫస్ట్ టైం భరత్.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!
గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ… సుమారు 30వేల మెజార్టీ సాధించారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ తుఫాన్ కు నారా లోకేష్ తో కలిపి సుమారు 151 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి పాలవ్వగా.. ఆ తుఫాన్ ను తట్టుకుని భారీ మెజార్టీతో భవానీ గెలుపొందారు. ఈ నేపథ్యంలో… మరోసారి తమ గెలుపు ఖాయమని భావిస్తుంది టీడీపీ!
మరోపక్క రాజమండ్రి తమ కంచుకోట అని చెప్పుకుంటున్న టీడీపీకి షాక్ ఇవ్వాలని.. రాజమండ్రి సిటీలో నీలి జెండా ఎగరేయాలని భరత్ కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి ఎంపీగా ఉన్నప్పటినుంచీ రాజమండ్రి సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు భరత్. ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలతోపాటు, తనదైన ప్రత్యేక కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ ప్రజల్లో పరపతి పెంచుకునేలా అడుగులు వేశారు.
ఇందులో భాగంగా… గుడ్ మార్నింగ్ రాజమండ్రి, రచ్చబండ వంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోపక్క పార్టీ తరుపున మీడియాలోను తన వాయిస్ ని బలంగా వినిపించే ప్రయత్నమూ చేస్తున్నారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, విమానాశ్రయ అభివృద్ధి, మోరంపుడి ఫ్లై ఓవర్ పనుల ద్వారా.. ఎంపీగా తాను చేసిన కృషిని గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు రాజమండ్రి అంతా గంజాయి మయం అయిపోయిందని టీడీపీ ఆరోపిస్తుంది..
మరి తాను చేసిన పనులు చూపించి ఓట్లు అడుగుతున్న భరత్ – వైసీపీ హయాంలో రాజమండ్రిలో గంజాయి, రౌడీ ఇజం పెరిగిపోయిందని చెబుతున్న వాసులలో ఎవరిని పట్టణ ప్రజలు ఆదరిశ్తారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… ఏపీ సాంస్కృతిక రాజధానిలో ఈసారి వైసీపీ వర్సెస్ కూటమి రసవత్తరంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.