కూటమి వర్సెస్ జగన్… గోదావరి జిల్లాలో తాజా పరిస్థితి ఇదే!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. జిల్లాలు జిల్లాల్లో పరిస్థితి సడన్ గా మారిపోతున్న పరిస్థితి. రెండు నెలల్లో లెక్కలు చాలా వేగంగా మార్పోయిన పరిస్థితి. ఈ విషయంలో స్వయంకృతాపరాధాలు కొన్ని ఉంటే… ప్రజల ఆలోచనా విధానాన్ని తక్కువ చేసి చూసే ఆలోచనా విధానం మరొకటి అయితే… అనూహ్యంగా ప్రజలకు చెప్పాలనుకున్న విషయం చెప్పడం ఇంకోటి!

సుమారు రెండు నెలక క్రితం.. సంక్రాంతి సమయంలో అనుకోవచ్చు. ఏపీ ప్రభుత్వంపైనా, జగన్ సర్కార్ పైనా ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వ్యతిరేకత తెరపైకి వచ్చింది! రాష్ట్రంలో అధికారాన్ని ఉభ‌య గోదావ‌రి జిల్లాలు శాసిస్తుంటాయని చెబుతుంటారు. అక్కడ ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని.. వీటిలో కూటమికి 30 స్థానాలు దక్కినా ఆశ్చర్యం లేదనే చర్చ కూడా నడిచిందన్నా అతిశయోక్తి కాదు.

ఈ సమయంలో టీడీపీ – జనసేన పార్టీలు చేసిన తప్పులు, ఇచ్చిన స్టేట్ మెంట్లు, పెట్టుకున్న పొత్తులు వెరసి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. ఉదాహరణకు నిన్నమొన్నటివరకూ టీడీపీ – జనసేన కలిస్తే మెజారిటీ నియోజకవర్గాల్లో కూటమి జెండా ఎగరడం కన్ ఫాం అనే కామెంట్లు వినిపించాయి. అప్పటికి బీజేపీతో పొత్తు లేదు కాబట్టి… ఇక్కడ ఆ విషయం చర్చనీయాంశమైన విషయం కాదు!

అయితే… జనసేన ఎప్పుడైతే 24 సీట్లకు పరిమితమైందో… తాను ముఖ్యమంత్రి అభ్యథి కాదని పవన్ చెప్పారో… పైగా ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి నేతలపై సెటైర్లు వేయడం, వారి ఆలోచనా విధానాన్ని తప్పుబట్టేలా వ్యాఖ్యానించడం వంటి పనులకు పూనుకున్నారో.. లెక్కలు మొత్తం ఒక్కసారిగా మరైపోయాయి. పైగా ఉన్న ఈ 24 స్థానాల్లో జనసేనలో బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాలను సైతం దక్కించుకోలేని పరిస్థితిని పవన్ పడిపోవడంతో ఈ డ్యామేజ్ మరింత ఎక్కువైంది.

పైగా రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన సిన్సియర్ జనసేన కార్యకర్తల్లో ఒకరైన కందుల దుర్గేష్ లాంటి వారి విషయంలో సైతం పవన్ మాట నిలబెట్టుకోలేకపోవడం మరింత డ్యామేజ్ ని తెప్పించింది. పైగా భీమవరం టిక్కెట్ ని జనసేన నేతలకు కాకుండా టీడీపీ నుంచి తెచ్చుకుని మరీ అంజిబాబుకి ఇవ్వడం, తణుకు విషయంలో జరిగిన పరిణామాలు వెరసి పవన్ పాలిటిక్స్ పై ఆ సామాజికవర్గంలోని ప్రజానికమే పెదవి విరిచే పరిస్థితి తలెత్తిందని తెలుస్తుంది.

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని ఏ నియోజకవర్గంలో అయినా ప్రస్తుతం ఇదే తరహా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. “ఇంతలోనే ఎలా మారిపోయిందండి పరిస్థితి… మావోడే చేజేతులా పాడు చేసుకున్నాడండీ… ఇక ఈసారి కష్టమేనండీ…!” అనే తెరహా డిస్కషన్స్ జరుగుతున్నాయి. “ఇదేంటండీ ఇలా అయిపోయింది పరిస్థితి…? చేజేతులా చేసుకున్నారండి మనోళ్లు… ఒంటరిగా పోటీ చేసినా అయిపోయేది!” వంటి కామెంట్లూ వినిపిస్తున్నాయి.

దీంతో… నిన్నమొన్నటివరకూ 34 స్థానాల్లోనూ కూటమి 30 స్థానాల్లో గెలిచిన ఆశ్చర్యం లేదు అనే చోట… పరిస్థితి చాలా మారిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు చర్చ లేనప్పుడు సగం సగంలా మారిపోయింది పరిస్థితి అని అంటున్న దశనుంచి… బీజేపీతో పొత్తు తర్వాత పరిస్థితి మరింతగా మారిపోయిందని.. రివర్స్ అయినా ఆశ్చర్యం లేదని.. గోదావరి జిల్లాల్లో ఎస్సీలు, క్రీస్టియన్లూ ఎక్కువగా ఉండటం దీనికి మరో కారణం అని చెబుతున్నారు.

దీంతో ఎన్నికలకు ఇంకా సుమారు రెండు నెలల వరకూ సమయం ఉండటంతో పరిస్థితి ఇంకెంత దారుణంగా మారతాదనేది మరింత ఆసక్తిగా మారింది. మరి ఈ సంక్షోభం నుంచి కూటమి ఎలా బయటపడుతుంది.. బయట పడుతుందా.. లేక, మరింత దిగజారిపోతుందా అనేది వేచి చూడాలి!