రావికొండలరావుగారు నాకిష్టమైన రచయిత.. గొప్ప నటుడు..
తెలుగు సినిమా ఎన్సైక్లోపీడియా అంటే కొండలరావుగారే..
వారు రాసిన ‘హ్యూమరథం’ పుస్తకాలు చదివితే సినిమా మనిషిగా.. సినిమా రచయితగా.. సినిమా జర్నలిస్ట్ గా ఆయనేంటో అర్థమవుతుంది..
కొండలరావుగారి స్వీయానుభవాల సమాహారం ఆ పుస్తకాలు..
‘అక్కినేని ఆలోచనలు’ పుస్తకం చదువుతుంటే.. నాగేశ్వరరావుగారే మన ఎదురుకూర్చొని మాట్లాడుతున్నట్లుంటుంది.. ఏఎన్నార్ భాషలోని యాస కూడా ఆ అక్షరాల్లో కనిపిస్తుంది.. దటీజ్ కొండల్రావ్ గారు..
ముళ్లపూడిగారి ‘కోతికొమ్మచ్చి’లో చాలా పేజీలు కొండలరావుగారివే..
ఎంతైనా.. బాపూరమణల ప్రాణమిత్రుడుగదా..
‘కోతికొమ్మచ్చి’ చదువుతుంటే.. అది బాపూరమణల కథ మాత్రమేకాదు ‘బాపూరమణరావిలకథ’ అనిపిస్తుంది.
రమణగారంత కాకపోయినా.. కొండలరావుగారు కూడా మాటలు రాయడంలో దిట్టే..
చందమామ విజయాకంబైన్స్ వారు మళ్లీ తెలుగులో సినిమాలు తీయాలనుకొని.. పింగళిలాంటి పెన్ను కోసం వెతికితే వారికి దొరికింది కొండలరావుగారే..
విజయావారి బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం చిత్రాల మాటలు కొండలరావుగారివే..
సినిమా జర్నలిస్ట్ గా ఎన్నో గొప్పగొప్ప పుస్తకాలు రాశారు.. ఈ మధ్యే ‘మాయాబజార్’ గురించి కూడా ఓ పుస్తకం రాసినట్టున్నారు..
తుదిశ్వాస విడిచేవరకూ అక్షరాన్ని వదలని కలం యోధుడు కొండలరావుగారు..
జర్నలిస్ట్ గా సూర్యకాంతంగారిని ఇంటర్యూ చేసి.. తదనంతరం నటుడై.. ఆవిడకే భర్తగా నటించిన ఘనుడు రావి..
నటునిగా కొండలరావుగారికి మంచిపేరు తెచ్చిన సినిమాలంటే.. ప్రేమించిచూడు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లిపుస్తకం, బృందావనం… ఇంకా చాలావున్నాయ్.. దాదాపు 600 సినిమాల్లో నటించారాయన..
తెలుగు సినిమాకు చెందిన మహానటులు, మహాదర్శకులందరితో పనిచేశారు కొండలరావు..
తెలుగు సినిమా పుస్తకం రాస్తే అందులో కొన్ని పేజీలు కొండలరావుగారివే..
సాక్షి లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రోజుల్లో.. ‘ఫ్లాష్ బ్యాక్’ పేరుతో పాత సినిమాల ముచ్చట్లు రాస్తుండేవాడ్ని.. నాకు తెలిసినవాటితో ఓ రెండుమూడు నెలలు నడిపించాను.. రోజుకొకటి రాయడమంటే తేలిక్కాదుకదండీ.. ఖజానా ఖాళీ అయిపోయింది.. కొత్త విషయాలకోసం వెతుకులాట మొదలైంది..
నా బాధ గమనించి.. నా కొలిగ్.. సీనియర్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణగారు.. కొండలరావుగారి ‘హ్యూమరథం’ పుస్తకాలు నాకిచ్చి చదవమన్నారు…
ఆ పుస్తకాలు నన్ను మద్రాసులో తెలుగు సినిమా స్వర్ణయుగంనాటి రోజులకి తీసుకెళ్లాయ్.. ఇక ఆ పుస్తకాల్లోని అద్భుతమైన విషయాలను నా శైలిలో రాయడం మొదలుపెట్టా..
అవి చదివి చాలామంది ఫోన్లు చేసేవారు.. అదంతా నా గొప్పే అన్నట్టుగా ఆనందంతో నా ఛాతి వెడల్పయ్యేది..
ఒకరోజు ఆఫీస్ పనిలో బిజీగా ఉండగా ఫోన్ రింగుమంది.. కొత్తనంబర్.. ఎవరా.. అని లిప్ చేశాను.. ఇక ఆ ఫోన్ సంభాషణ ఇలా సాగింది..
హలో..
బుర్రా నరసింహేనా మాట్లాడేదీ..
అవునండీ..
మీ ఫ్లాష్ బ్యాక్లు చదుతున్నాను.. చాలా బావుంటున్నాయ్.. బాగా రాస్తున్నారుకూడా..
థ్యాక్సండీ…(గర్వంగా..)
మీ వయసెంతండీ..
ముప్పై ఆరండీ..
చాలా చిన్నవారూ(ఆశ్చర్యంగా)… మరి యాభైఅరవై ఏళ్లనాటి సంగతులు చూసినట్టు రాస్తున్నారు.. ఎలా సాధ్యం..?
మీలాంటి పెద్దల దగ్గర తెలుసుకున్న విషయాలు సార్..
అన్ని గొప్పగొప్ప విషయాలు మీకు తెలియజేస్తున్న ఆ మహానుభావులెవరండీ..
రావికొండలరావు గారి ‘హ్యూమరథం’ పుస్తకంలోని చాలా విషయాలు ఫ్లాష్ బ్యాక్ కింద వాడానుసార్..
ఓహో.. ఫలానా వారు రాసిన ఫలానా పుస్తకం ఆధారంగా చేసుకొని ఈ విషయం రాస్తున్నాను.. అని ఓ నాలుగక్షరాలు ఆ పుస్తకం గురించి కూడా రాయడం భావ్యం అనుకుంట..
అవున్సార్.. తప్పుజరిగింది.. క్షమించాలి.. ఇక ఆ తప్పు జరగదు..
అయితే.. ఆ సేకరణని నీ శైలిలో రాస్తున్నావ్.. మీ శైలి బావుంది.. God bless you..
థ్యాక్సండీ…
నేను కూడా సినిమాజర్నలిస్టునేలేండి..
అవునా సార్.. మీ Good name plz..
నన్ను రావికొండలరావు అంటారు…
ఇక నా పరిస్థితి ఎలా వుండివుంటుందో ఊహించండి..
మొన్నామధ్య తెలుగువన్ లో చేస్తున్నప్పుడు రెండేళ్ల క్రితం ఆయన్ను ఇంటర్వ్యూ చేసే భాగ్యం దక్కింది..
పాత విషయాలు గుర్తుచేస్తే పకపకా నవ్వారు మహానుభావుడు..
అలాంటి మహానుభావుడు ఇకలేరంటే మనసంతా ఏదోలావుంది..
– బుర్రా నరసింహా (సీనియర్ జర్నలిస్ట్, రచయిత)